ఆపరేషన్​‘హరీష్’.. సవాళ్లతో గట్టేక్కెనా..?

by  |
Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : సర్కార్ దవాఖాన్లను మెరుగు పరిచేందుకు మంత్రి హరీష్​‘స్పెషల్​ ఆపరేషన్’​ నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైద్యశాఖను ప్రక్షాళన చేసే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనదైన శైలీలో ప్రతీ రోజూ రివ్యూలు ఏర్పాటు చేస్తూ వైద్యవ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా అధికారులు, నిపుణులతో చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు.

స్వరాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. గత ఆరోగ్యశాఖ మంత్రులతో కానీ పనులను తాను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఫెండింగ్‌లో ఉన్న సమస్యలు, అంశాలపై సంబంధిత అధికారుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లు పరిష్కారం కానీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? లేదా? అని వైద్యశాఖలో హాట్​హాట్‌గా చర్చ నడుస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మార్కెటింగ్, ఇరిగేషన్‌తో పాటు ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఆయా శాఖలకు తనదైన ముద్ర వేశారు. ఉద్యోగుల సమస్యలతో పాటు ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు.ఇది ఆయనకు మంచి పేరును తేవడంలో ఎంతో దోహదపడింది.

ఇప్పుడు కొత్తగా ఆరోగ్యశాఖకు బాస్​కావడంతో దీన్నికూడా సమర్ధవంతంగా తీర్చిదిద్దుతారని డాక్టర్లు, మెడికల్​జేఏసీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా, ఆయన ముందెన్నో సవాళ్లు టాస్క్‌గా నిలుస్తున్నాయి. వాటిని అధిగమిస్తూ వైద్యశాఖను పటిష్టం చేస్తారా? లేదా? అనేది ఎంతో మంది వైద్యసిబ్బంది వేచి చూస్తున్నారు.

అప్పట్లో ఫెండింగ్‌కు ఇదే కారణం..

వైద్యశాఖలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక పరమైన చిక్కులే. గతంలో అవి నెరవేరకపోవడానికి ఆర్థిక అంశాలే అడ్డొచ్చినట్లు హెల్త్​ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆరోగ్య, ఆర్థికానికి హరీష్​రావే మంత్రి కావడంతో ఆ సమస్యలన్నీ సులువుగా పరిష్కారం అవుతాయని వైద్యశాఖలోని ఉన్నతాధికారుల నుంచి క్రింది స్థాయి సిబ్బంది వరకు చెవులు కొరుకుంటున్నారు. ఇక నుంచి వైద్యశాఖకు మహర్ధశ రానుందని సంబర పడుతున్నారు. ఇప్పటికే హెల్త్​డిపార్ట్​మెంట్‌లోని వివిధ విభాగాల ఉద్యోగుల యూనియన్లు సమస్యలను వినతి పత్రాల రూపంలో మంత్రికి అందజేశారు. అతి త్వరలో వాటన్నింటిని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు డాక్టర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అన్ని సవాళ్లే…

ఆరోగ్య శాఖకు ప్రక్షాళన చేసేందుకు రంగంలోకి దిగిన మంత్రి హరీష్​రావుకు ముళ్లబాటే ముందున్నది. అనేక అంశాలు డిపార్ట్​మెంట్‌ను సతమతం చేస్తున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్యశాఖలో పర్మినెంట్ పోస్టుల భర్తీలు ఆశీంచిన స్థాయిలో జరగలేదు. హెచ్ఓడీల దగ్గర నుంచి కింది స్థాయి వరకు అదే పరిస్థితి ఉన్నది. దీంతో ఆయన తనదైన శైలీలో చిక్కులు తొలగించాల్సిన అవసరం ఏర్పడింది.

పోస్టుల లొల్లి..

రాష్ట్ర విభజన సమయంలో ఒక శాఖలో మూడు పోస్టులు ఉంటే రెండు ఆంధ్ర, ఒకటి తెలంగాణకు వెళ్లాలనేది రీ ఆర్గనైజేషన్ యాక్ట్ చెబుతోంది. అదే విధంగా రెండు పోస్టులు ఉంటే ఒకటి ఏపీ, మరోకటి తెలంగాణకు, కేవలం ఒకటే పోస్టు ఉంటే అది ఏపీకి ఇచ్చి, తెలంగాణలో కొత్త పోస్టు క్రియేట్ చేసుకోవాలనేది నిబంధన. కానీ హెల్త్ డిపార్ట్ మెంట్‌లో రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌ను అమలు చేయడం లేదని స్వయంగా ఆ శాఖలోని ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డీఎంఈ, డీహెచ్​ పోస్టులు ఏపీకి వెళ్లాయి. కానీ ఇప్పటి వరకు ఆ పోస్టులు క్రియేట్ కాలేదు. దీంతో పాటు హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఒక్క దళిత హెచ్ఓడీ కూడా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైద్యశాఖలో సీనియారిటీ ప్రకారం పోస్టులు ఇవ్వడం లేదని పదే పదే వైద్యసంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో వీటిని ఎలా పరిష్కరిస్తారనేది ప్రస్తుతం మంత్రి హరీష్​రావుకు పెద్ద టాస్క్. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి వెళ్లిపోయిన డీఎంఈ, డీహెచ్​ పోస్టులను క్రియేట్​ చేయడం, వాటిలో సమర్ధవంతంగా ఉన్న అధికారులను నియమించడం తలనొప్పిగా మారనుంది. దీంతో పాటు కొత్త జిల్లాల్లో డీహెఎంహెచ్​లను రిక్రూట్​ చేయడం కూడా పెద్ద సవాలే.

రిక్రూట్​మెంట్​….

ప్రస్తుతం కొత్తగా వస్తున్న ప్రతీ హాస్పిటల్‌లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్​విధానాల్లో నియామకాలు చేస్తున్నారు. కరోనా సమయంలో వచ్చిన టీమ్స్​లోనూ ఇదే విధానంలో నియమకాలు జరిగాయి. ఈ వ్యవస్థను తొలగిస్తానని ఏకంగా సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించినా, ఇప్పటి వరకు అది అమలు కాలేదు. ఈ క్రమంలో కొత్తగా అందుబాటులోకి రాబోతున్న పల్లె దవఖాన్లు, మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్​స్పెషాలిటీ, హైదరాబాద్​నలువైపులా నాలుగు ఆసుపత్రుల్లో సిబ్బంది నియమకాలు చేపట్టడం పెద్ద సమస్యగా మారనున్నది. ఇప్పటికే పల్లె దవాఖాన్లలో డాక్టర్ల భర్తీకి కాంట్రాక్ట్​ విధానంలో నొటిఫికేషన్​ఇవ్వగా, పనిచేసేందుకు కనీసం ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. చేసేదేమీ లేక వెంటనే పర్మినెంట్​విధానంలో భర్తీ చేయాలని సర్కార్​నిర్ణయం తీసుకున్నది. ఇక మెడికల్​ కాలేజీలు, ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి రానున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు.

పెద్ద టాస్కే….

సర్కార్​దవాఖాన్లలో డాక్టర్లు, నర్సులు, పారమెడికల్​స్టాఫ్​పెంచడం, పేషెంట్లకు భరోసా కల్పించేందుకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో చిక్కులు ఏర్పడే అవకాశం ఉన్నది. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్, స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు అలవెన్స్‌లు ఇవ్వడం, అర్హులకు ప్రమోషన్లు, పోస్టింగ్‌లు విషయాల్లో మంత్రి ఎలా నిర్ణయం తీసుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు గతంలో జిల్లాకో హాస్పిటల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తానని ఏకంగా సీఎం హామీ ఇచ్చారు. దీంతో పాటు ఇప్పటికే నిర్మాణాలో ఉన్న 8 మెడికల్​ కాలేజీలకు అదనంగా మరో 4 కొత్త మెడికల్​కాలేజీలు రానున్నాయి. అయితే ఇప్పటికే అనుమతులు వచ్చిన కాలేజీల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నేషనల్​మెడికల్ కమీషన్ తనిఖీల సమయం కూడా సమీపంలో ఉన్నందున వీటిని పరిష్కరించేందుకు మంత్రి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీంతో పాటు శానిటేషన్​ వ్యవస్థను బలోపేతం చేయడం, ఆసుపత్రుల్లో క్రింది స్థాయి సిబ్బంది నిత్యం చేస్తున్న తప్పిదాలను తొలగించాలి. దీంతో పాటు కొందరి హెచ్​ఓడీల మనుషులే కీలక పోస్టుల్లో ఉండటం, నిత్యం వైద్యశాఖ సిబ్బంది సమస్యలను వినతి పత్రాల రూపంలో ఇవ్వడం, ఆసుపత్రులకు సకాలంలో మందులు సరఫరా, ప్రైవేట్​ధీటుగా వైద్యసేవలు అందేలా చూడటం వంటివి చేయాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు కాంట్రాక్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో హామీ ఇచ్చినా పీఆర్​సీ ఇవ్వడం లేదు. ఇక నర్సింగ్ కౌన్సిల్, ఆసుపత్రుల్లోని ఖాళీల భర్తీ, కింది స్థాయి సిబ్బంది లంచాలు సేకరణ, ఆరోగ్యశ్రీ బకాయిలు, మౌలిక వసతులు, ప్రైవేట్​ దోపిడీని అడ్డుకోవడం వంటివి వైద్యశాఖలో అధికంగా ఉన్నది.

నర్సుల సమస్యలు…

ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వైద్యసేవలు అందించే నర్సుల సమస్యలు ఎన్నో దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయి. స్టాఫ్ నర్స్ నుండి నర్సింగ్ ఆఫీసర్ గా హోదా మార్పు, నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు, నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు, పెరిగిన పడకలకు అనుగుణంగా నర్సులను పెంచడం, ఖాళీ నర్సింగ్​ పోస్టులను భర్తీ చేయడం, కనీన వేతనాలు అమలు, కొత్తగా నియమించబడిన నర్సులకు లంచం ఇవ్వనిదే జీతాలు ఇవ్వకపోవడం, వైద్యా విధాన పరిషత్తులో పనిచేస్తున్న నర్సులకు హెల్త్​ కార్డులు ఇవ్వడం, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్‌లో నర్సస్ స్థానం కల్పించడం, కాళోజీ నారాయణ రావు ఆరోగ్య యూనివర్సిటీ లో నర్సింగ్ రిజిస్టర్ పోస్ట్ ఏర్పాటు, ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే నర్సులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక రూంలు కల్పించడం, మౌలిక వసతులు లేమీ వంటి ఏళ్ల తరబడి సమస్యలు ఉన్నాయి. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆరు నర్సింగ్​ కాలేజీల్లో ఉస్మానియా తప్ప మిగతా ఐదింటిలో ఇప్పటికీ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాళ్లతోనే నెట్టుకొస్తున్నారు.వాటిలో పర్మినెంట్​స్టాఫ్​ను నియమించడం, 20 నుంచి 30 సంవత్సరాలు గడుస్తున్నా నర్సులకు ప్రమోషన్లు లేకపోవడం రాష్ట్రంలో అత్యధికంగా వేధిస్తున్నాయి. వీటిని వేగంగా పరిష్కరిస్తే రాష్ట్రంలో వైద్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని స్వయంగా ఆ శాఖలోని సిబ్బంది చెబుతున్నారు.


Next Story

Most Viewed