ముంబై ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఆందోళన

by  |
ముంబై ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఆందోళన
X

ముంబయి: కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముంబయి మహానగరంలో వైద్య సిబ్బంది పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నిర్విరామంగా విధులు నిర్వహించడం, కుటుంబానికి నెలల పాటు దూరంగా ఉండటం, సెలవులకూ నోచుకోక.. విశ్రాంతిలేక అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబయిలోని కేఈఎం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వర్కర్.. సెలవు దొరక్క నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడి ఆదివారం మరణించడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సంబంధిత ఆసుపత్రి వైద్య సిబ్బంది భగ్గుమన్నది. మంగళవారం ఆస్పత్రి ఆవరణలో మాస్కులు, సేఫ్టీ గేర్‌లు ధరించి వందల సంఖ్యలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో పనిచేసే ఓ వర్కర్ నాలుగు రోజులు అనారోగ్యంతో బాధపడ్డాడు. కానీ, పని ఒత్తిళ్ల కారణంగా అతనికి సెలవు ఇవ్వలేదు. ఆదివారం రాత్రి ఆయన ఆస్పత్రిలోనే మరణించాడు. సోమవారం రాత్రి నుంచి ఆయన బాడీ మార్చురీలోనే ఉన్నది. ఈ ఘటనపై ఆందోళనకు దిగిన వైద్య సిబ్బంది ఆ వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఆర్థిక సహాయాన్ని అందించాలని అడిగారు.

శవాలతో నిండిపోయిన మార్చురీ ఆందోళనకు దిగిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, క్లాస్ 4 వర్కర్‌లు ఆస్పత్రిలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను వెలుగులోకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. ఆ ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని మార్చురీ శవాలతో నిండిపోయింది. దీంతో మిగతా మృతదేహాలను నీలం రంగు ప్లాస్టిక్ కవర్‌తో చుట్టి మొదటి ఫ్లోర్‌కు తరలించారు. టెస్టింగ్ ల్యాబ్ పక్కనే కారిడార్‌లో స్ట్రెచర్‌లపై ఈ మృతదేహాల చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాతో మృతిచెందినవారి దేహాలను ఒక పద్ధతి ప్రకారం బ్లూ కలర్ కవర్‌తో చుడుతారు. దానికి క్లాస్ 4 ఎంప్లాయీస్‌కు శిక్షణ కూడా ఇస్తారు. కానీ, చాలా సార్లు ఆ సిబ్బంది కొరత వల్ల డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఈ పని చేయాల్సి రావడంతో అదనపు భారాన్ని ఎదుర్కొంటున్నారు. ముంబయి నగరంలో ఆస్పత్రుల సామర్థ్యానికి పెను సవాలుగా కరోనా మహమ్మారి పరిణమిస్తోందన్న విశ్లేషణలకు ఈ చిత్రాలు ఊతమిస్తున్నాయి.


Next Story

Most Viewed