ప్రభుత్వం కీలక ప్రకటన.. "ఆ వార్త తప్పు"

by  |
DIPAM Secretary
X

దిశ, వెబ్‌డెస్క్: తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిర్ఇండియా కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సంస్థ బిడ్‌ను ప్రభుత్వం ఆమోదించినట్టు శుక్రవారం వార్తలు వినిపించాయి. 68 ఏళ్ల క్రితం టాటా ఎయిర్‌లైన్స్‌తో పేరుతో జేఆర్‌డీ టాటా స్థాపించిన ఈ సంస్థను వారే తిరిగి దక్కించుకున్నారని నివేదికలు విడుదలయ్యాయి. అయితే, దీనిపై ప్రభుత్వం మధ్యాహ్నానికి స్పష్టత ఇచ్చింది. ఎయిర్ఇండియా బిడ్డింగ్‌లో టాటా సంస్థను ఖరారు చేయలేదని, అలా వచ్చిన వార్తలను ఖండిస్తున్నట్టు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి వెల్లడించారు. ఎయిర్ఇండియా ప్రైవేటీకరణలో భాగంగా దాఖలైన టాటా సంస్థ బిడ్‌ను కేంద్ర మంత్రుల కేబినెట్ ఖరారు చేసిందనే వార్త తప్పని, దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటన విడుదల చేయనున్నట్టు కార్యదర్శి సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.

కాగా, ఎయిర్ఇండియా ఎవరి సొంతమవనుందనే అంశంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఎయిర్ఇండియా కూడా ఈ అంశంపై ఎలాంటి వివరాలను ఇవ్వలేదు. కాబట్టి అధికారిక ప్రకటనపై ఇంకా స్పష్టత లేదని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం ఈ నెల దసరా సమయానికి విజయవంతమయ్యే బిడ్డర్ పేరును ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.


Next Story

Most Viewed