ఘరానా సైబర్ క్రైమ్.. 27 లక్షలు లూటీ..

by  |
ఘరానా సైబర్ క్రైమ్.. 27 లక్షలు లూటీ..
X

దిశ, మెదక్: లాటరీలో 2.90 కోట్లు వచ్చాయని నమ్మబలికి బాధితుడి నుంచి 27 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్లు దోచుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణఖేడ్ ఎస్ఐ డి.వెంకట్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. మండలానికి చెందిన ఒక వ్యక్తి ని కరోనా రిలీఫ్ ఫండ్ అవార్డుల్లో భాగంగా లాటరీ వచ్చిందని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ఫోన్ నెంబరు, అడ్రస్ మెయిల్ కు పంపాలని సూచించారు. 2.90 లక్షలు లాటరీ వచ్చింది అని, అ డబ్బును పొందాలంటే ఆర్బీఐ యాక్ట్ ప్రకారం మీరు 17 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు. దీంతో బాధితుడు విడతలవారీగా 17 లక్షల వరకు చెల్లించాడు. అనంతరం నేరగాళ్లు ఏటీఎం కార్డును పంపించి అందులో ఐదు వేల రూపాయలు ఉంచి బాధితుడికి అందించారు. దీంతో ఇది నిజం అనుకున్న బాధితుడు లాటరీ డబ్బులు వస్తాయని కలలుగన్నాడు.

ఈ క్రమంలో పూర్తి డబ్బులు పొందాలంటే కస్టమ్స్ చార్జీలు మరో పది లక్షలు చెల్లించాలని నమ్మించారు. ఇలా మరో సారి పది లక్షల వరకు ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్‌‌ల ద్వారా మెుత్తం 27 లక్షలకు పైగా దోచుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. ఫోన్‌కు వచ్చిన ఒక చిన్న మెసేజ్‌తో లాటరీలో కోట్లు వస్తాయనే దురాశతో రూ. 27 లక్షలు చెల్లించడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. వాట్సాప్ లలో న్యూడ్ కాల్ పేరిట బ్లాక్‌మెయిల్ చేస్తుంటారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడగటం, బ్యాంకుల నుండి మాట్లాడుతున్నామని ఫోన్ చేసినా ఓటీపీ, ఇతర సమాచారం ఇమ్మని మబ్యపెడతారని, వారికి ఎలాంటి సమాచారం చెప్పరాదని సూచించారు.


Next Story