జస్ట్ మిస్.. కరీంనగర్‌లో భారీగా క్రాస్ ఓటింగ్.. సర్దార్‌‌కు పాజిటివ్ రెస్పాన్స్

by  |
జస్ట్ మిస్.. కరీంనగర్‌లో భారీగా క్రాస్ ఓటింగ్.. సర్దార్‌‌కు పాజిటివ్ రెస్పాన్స్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్/ కరీంనగర్ సిటీ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అంచనాలు తారుమారు అయ్యాయి. రెబల్ అభ్యర్థి సర్దార్ రవిందర్ సింగ్‌ను పరిగణనలోకి తీసుకోనట్టు మాట్లాడిన అధికార పార్టీ నాయకులు ఫలితాల తరువాత ఖంగు తినాల్సిన పరిస్థితే ఎదురయ్యిందని చెప్పక తప్పదు. ఫస్ట్ ప్రయారిటీలో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఏ ఒక్కరికైనా మూడో వంతు ఓట్లు రానట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించాల్సి వచ్చేది.

అప్పుడు రవిందర్ సింగ్ విజయం వరించే అవకాశాలు కూడా ఉండేవి. అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేసిన వారు రెండో ప్రాధాన్యతగా రవిందర్ సింగ్ వైపు మొగ్గు చూపారని స్పష్టం అవుతోంది. 232 ఓట్లు రవిందర్ సింగ్‌కు రావడం అనేది అధికార పార్టీకి సవాలేనని చెప్పకతప్పదు. 18 రోజులకు పైగా క్యాంపులతో పాటు వారిని మచ్చిక చేసుకునేందుకు అధికార పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నించింది. అయితే రవిందర్ సింగ్‌కు అసలు ఓట్లే రావని, 50 ఓట్ల వరకు వస్తాయని టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ రవిందర్ సింగ్ 232 ఓట్లు సాధించడం గమనార్హం.

క్యాంపే లేకుంటే..

టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం క్యాంపులు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయమే అభ్యర్థులకు వరంగా మారింది. లేనట్టయితే స్థానికంగా ఉన్న ఓటర్లను రవిందర్ సింగ్ మెప్పించి ఒప్పించి విజయం సాధించేవాడని తేటతెల్లం అవుతోంది. క్యాంపు పాలిటిక్స్ చేసినా రవిందర్ సింగ్‌కు వచ్చిన ఓట్లను గమనిస్తే మాత్రం అధికార పార్టీకి ఈ ఎన్నికలు చేదు అనుభవాన్నే మిగిల్చాయని స్పష్టం అవుతోంది. 1080 మంది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ అధిష్టానం అంచనా వేసింది. ఈ మేరకు సమీకరణాలు కూడా జరిపినప్పటికీ ఫలితాలు మాత్రం కొంత వైవిద్యంగానే వచ్చాయి. పార్టీ అధిష్టానం ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని దిద్దుబాటు చర్యలకు పాల్పడడం వల్లే గెలుపు సాధ్యం అయిందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

క్రాస్ ఓటింగ్ జరిగిందా..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కాగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా అర్థం అవుతోంది. అధికార పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల తేడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. భానుప్రసాదరావుకు 585 ఓట్లు రాగా, ఎల్ రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టం అవుతోంది. రవిందర్ సింగ్ కూడా క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకున్నప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో మాత్రం ఓటర్లు ఆయన ఆశలపై నీళ్లు చల్లారు.



Next Story

Most Viewed