ఒలింపిక్స్‌లో ‘మణి’పూసలు.. పవర్‌‌హౌజ్ ఆఫ్ అథ్లెట్స్

by  |
ఒలింపిక్స్‌లో ‘మణి’పూసలు.. పవర్‌‌హౌజ్ ఆఫ్ అథ్లెట్స్
X

దిశ, ఫీచర్స్ : ఈశాన్య రాష్ట్రమైన ‘మణిపూర్’ ప్రపంచపతాక చాంపియన్లను అందిస్తూ భారతదేశ పటంలో ప్రకాశవంతంగా మెరుస్తోంది. 2012 ఒలింపిక్స్‌లో పతకం సాధించిన స్టార్‌తో సహా విశ్వక్రీడలకు ప్రతీసారి గణనీయ సంఖ్యలో మెరికల్లాంటి అథ్లెట్లను తయారుచేస్తోంది. ఈ ఏడాది కూడా మణిపూర్ నుంచి ఐదుగురు అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. బాక్సింగ్‌ అంటే హర్యానా, హాకీ పేరు చెప్పగానే ఒడిశా గుర్తుకువచ్చినట్లు.. మణిపూర్ ప్లేయర్స్ ఒలింపిక్స్‌కు కేరాఫ్‌గా మారిపోయారు. ఈ మేరకు చాలా ఏళ్లుగా గొప్ప క్రీడా సంస్కృతిని చాటుతున్న భారతీయ ఈశాన్య మణిపూసలపై ఓ స్పెషల్ స్టోరీ!

మణిపూర్‌ చిన్నారులు బాల్యం నుంచే ఆటల్లో ఆరితేరుతారు. పెరుగుతున్న కొద్దీ తమకు నచ్చిన గేమ్‌పై మరింత ఫోకస్‌గా శ్రమిస్తారు. రోజురోజుకూ ఆటలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ఎదుగుతారు. ఆకాశమే హద్దుగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటుతారు.

బాక్సింగ్ :

2000 ఒలింపిక్స్‌లో నాంగోమ్ డింగో, సౌబమ్ సురేష్‌ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. మేరీ కోమ్, లైశ్రామ్ దేవేంద్రో 2012 ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేయగా, మేరీ కాంస్య పతకం సాధించి, ఒలింపిక్స్ మెడల్ అందుకున్న తొలి మణిపురిగా రికార్డు సృష్టించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన మేరీ కోమ్.. టోక్యో ఒలింపిక్స్‌లో కొలంబియా ప్రత్యర్థిపై న్యాయ నిర్ణేతల భిన్నమైన నిర్ణయంతో అనూహ్యంగా ఓడిపోయింది. మరోసారి భారత్‌కు పతకం అందించాలని కలలుగన్న మేరీ, ఈ పరిస్థితిని ఊహించలేకపోయింది. రింగ్‌లోనే భావోద్వేగానికి గురైంది. కాగా ఓడిపోయినా ‘యూ ఆర్‌ ది లెజండ్‌.. మీరే విజేత.. మీరే మాకు ఆదర్శం’ అంటూ యావత్ భారతావని ఆమెపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది.

వెయిట్‌లిఫ్టింగ్ :

2004 ఒలింపిక్స్‌లో థింగ్‌బైజామ్ సనామాచా 53 కిలోల విభాగంలో, కుంజారాణి 48 కేజీల కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు. కుంజారాణి తృటిలో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది. 2012లో నంగ్‌బామ్ సోనియా 48కిలోల విభాగంలో పోటీపడింది. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజత పతకంతో భారత్‌ తరఫున తొలి విజయాన్ని నమోదు చేసింది. ఏడేళ్ల నుంచి అంకిత భావంతో కృషిచేసిన ఈ పవర్‌లిఫ్టర్ ఎట్టకేలకు తన కల సాకారం చేసుకుని భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది.

జూడో :

ఒలింపిక్స్‌(2000)లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ మహిళా జూడోకా ‘లూరెంబామ్ బ్రోజెషోరి’. కాగా 2008లో ఖుముజం టోంబి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
ఇక 2020 టోక్యోకు అర్హత సాధించిన ఏకైక భారతీయ జూడోకా లిక్మాబామ్ సుశీల.

ఆర్చరీ :

మణిపూర్ నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఏకైక విలుకారిణి లైశ్రామ్ బొంబాయిలా. ఆమె 2008 ఒలింపిక్స్‌లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ క్రమంలో 2012, 2016 ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న లైశ్రామ్.. ఒలింపిక్స్‌లో వరుసగా మూడుసార్లు పోటీ చేసిన ఏకైక మణిపురిగా నిలిచింది.

హాకీ :

2016 ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీకి నాయకత్వం వహించిన పుఖ్రంబం సుశీల చాను.. ప్రస్తుతం జరుగుతున్న విశ్వక్రీడల్లో రెండోసారి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఇక నీలకంఠ శర్మ భారత పురుషుల హాకీ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్నారు. అతను 2016 పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా.

సిద్ధమవుతున్న మణులు :

ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేసినప్పటికీ, మణిపూర్‌లో క్రీడా మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. 2017‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్‌కు జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారు. ఇక్కడి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుస్తున్నారు. ఈ రాష్ట్రానికి చెందిన బాలా దేవి స్కాటిష్ లీగ్‌లో నంబర్ 10 జెర్సీని సంపాదించగా, ఇండియన్ సాకర్ లీగ్‌లో దాదాపు 43 మంది మణిపురి ఆటగాళ్లు దేశంలోని వివిధ ఫుట్‌బాల్ క్లబ్‌ల కోసం ఆడుతున్నారు. ఏ రాష్ట్రానికైనా ఇదే అత్యధికం. మణిపూర్‌‌లో రూపుదిద్దుకుంటున్న మెరికల్లాంటి ఆటగాళ్ల విజయాలను చూసిన ప్రభుత్వం ‘ఖేలో ఇండియా’లో భాగంగా మణిపూర్‌లోని 16 జిల్లాల్లో క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.


Next Story

Most Viewed