పండగపూట విషాదం.. లారీ ఢీకొని వివాహిత మృతి

46

దిశ, ఏపీబ్యూరో : సంక్రాంతి పండుగ ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు కొత్త బట్టలు కొందామని దంపతులిద్దరూ ద్విచక్రవాహనంపై రావులపాలెంనకు వెళ్లారు. అక్కడ నచ్చకపోవడంతో తణుకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో వివాహిత మృతి చెందగా, భర్త ప్రాణాలతో భయటపడ్డాడు.

వివరాల్లోకెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన అద్దంకి విజయకుమార్, జ్యోతి కుమారి దంపతులు. పిల్లలకు కొత్త దుస్తులు కొనేందుకు మంగళవారం రావుల పాలెం వెళ్లారు. అక్కడ సరిపోయే దుస్తులు లేవని తణుకు బయల్దేరారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారి బైక్​ను లారీ ఢీ కొట్టింది. జ్యోతికుమారి (32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయాలపాలైన విజయకుమార్​ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.