బాసరలో తీవ్ర విషాదం.. పెళ్లి రోజే ఆమెకు చివరి రోజైంది

by Aamani |   ( Updated:2021-06-15 04:58:29.0  )
laxmi-died 1
X

దిశ, ముథోల్ : బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా పెళ్ళి రోజునే వివాహిత మృతి చెందటం స్థానికులను కంటతడి పెట్టించింది. విషయం తెలిసి బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగ్గా సంవత్సరం కిందట అనగా 15 జూన్ 2020న బాసరకు చెందిన సతీష్‌తో బైంసాకు చెందిన లక్ష్మి (22)ని ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు.

అయితే, పెళ్లికి ముందు నుంచే ఆమె మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే లక్ష్మికి గత కొద్దిరోజుల కిందట కూతురు పుట్టి చనిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఆమెకు మూత్ర పిండాల వ్యాధి తీవ్రతరం కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచింది. పెళ్లి రోజే భార్యను కోల్పోవడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Next Story