ముందుచూపు లేనందువల్లే ఈ దుస్థితి !

by  |
ముందుచూపు లేనందువల్లే ఈ దుస్థితి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వానికి ముందు చూపు, ముందస్తు ప్రణాళిక లేని కారణంగానే ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఈ దుస్థితి ఏర్పడిందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మాజీ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు సముద్రం లేనంత మాత్రాన విపత్తులు రావనే నిర్లక్ష్యం పనికిరాదని, ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఆదాయంలో సింహభాగం హైదరాబాద్ నగరం నుంచి వస్తున్నా కల్పించిన సౌకర్యాలు మాత్రం శూన్యమన్నారు. నగరానికి అందాలు, సౌందర్యాన్ని సమకూరిస్తేనే సరిపోదని, వీటితో విపత్తులను నివారించలేమని, పాలకులు ఈ విషయాన్ని గ్రహించాలని గురువారం మీడియా సమావేశంలో హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని ఇప్పుడు తప్పించుకోవడం సహేతుకం కాదని, గడచిన ఆరేండ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

వరద నివారణ కోసం, నాలాల మెరుగుదల కోసం చేయాల్సిన పనుల్ని చేయలేదని, తక్షణం విపత్తు నిర్వహణ (నివారణ) సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. విపత్తుల నివారణ కోసం రాష్ట్రానికి ఒక శాశ్వత వ్యవస్థ ఉండాలన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం రూ. 67వేల కోట్లను ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వం చెప్తోందని, అదే నిజమైతే ఈ వరదలు ఎందుకు వచ్చాయని, వీటిని ఎందుకు ఆపలేకపోయామని ప్రశ్నించారు. కేంద్ర బృందాన్ని పంపామని బీజేపీ, తక్షణం నగదు సాయం అందించామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటున్నాయని, కానీ ఇదంతా జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నవేనని ఆరోపించారు.


Next Story

Most Viewed