- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డైట్’.. ఫ్యూచర్ డౌట్!
<p>దిశ, మహబూబ్ నగర్: 32 ఎకరాల సువిశాల డైట్ కళాశాల ప్రాంగణం. అందులోకి బీఈడీ కళాశాల, బీసీ స్టడీ సర్కిల్, జిల్లా గ్రంథాలయం వచ్చాయి. ఏముందిలే.. అన్నీ విద్యాకేంద్రాలే కదా అనుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ భవన్లు వచ్చాయి. సరేలే ప్రభుత్వ స్థలాలకు కొరత ఉంది కదా అనుకున్నారు అంతా. ఇప్పుడు ఏకంగా మార్కెట్ యార్డ్ నిర్మాణానికే పూనుకున్నారు. విద్యాలయాలు ఉనికికే ముప్పు తీసుకువచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం మెట్టుగడ్డ ప్రాంతంలో డిస్ట్రిక్ ఇన్‌స్టిట్యూట్ […]</p>

దిశ, మహబూబ్ నగర్: 32 ఎకరాల సువిశాల డైట్ కళాశాల ప్రాంగణం. అందులోకి బీఈడీ కళాశాల, బీసీ స్టడీ సర్కిల్, జిల్లా గ్రంథాలయం వచ్చాయి. ఏముందిలే.. అన్నీ విద్యాకేంద్రాలే కదా అనుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ భవన్లు వచ్చాయి. సరేలే ప్రభుత్వ స్థలాలకు కొరత ఉంది కదా అనుకున్నారు అంతా. ఇప్పుడు ఏకంగా మార్కెట్ యార్డ్ నిర్మాణానికే పూనుకున్నారు. విద్యాలయాలు ఉనికికే ముప్పు తీసుకువచ్చారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం మెట్టుగడ్డ ప్రాంతంలో డిస్ట్రిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డైట్) కళాశాలను 1989లో ఏర్పాటు చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం 32 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అందులో ఎకరం భూమి మినహాయించి 31 ఎకరాల్లో కళాశాలను ఏర్పాటు చేశారు. కానీ, అదే ప్రాంగణంలో బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతి కాలంలో సర్వశిక్ష అభియాన్, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, బీసీ స్టడీ సర్కిల్, జిల్లా గ్రంథాలయం, ప్రెస్‌క్లబ్, గిరిజన సంక్షేమ సంఘం భవన్ ఇలా ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ వెళ్లారు. ఇలా 31 ఎకరాల డైట్ కళాశాల ప్రాంగంణం కాస్తా 75 శాతం కుదించుకుపోయింది. ప్రస్తుతం కళాశాల కార్యక్రమాలు నిర్వహించడం సైతం ఇబ్బందిగా మారింది.
తొలుత డైట్ కళాశాల ప్రాంగణంలో వివిధ పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం యంత్రాంగం అనుమతిస్తూ వెళ్లింది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి సంస్థలను ఏర్పాటు చేయడంతో ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు అడ్డు చేప్పలేదు. ఆందోళన వ్యక్తం చేయలేదు. దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రభుత్వ యంత్రాంగం విద్యా సంస్థలు ఉన్న ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ వెళ్లింది. అక్కడితో ఆగకుండా ప్రెస్‌క్లబ్, గిరిజన సంక్షేమ భవన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక తాము ఏం చేసినా ఎవరూ అడ్డు చెప్పరని భావించిన అధికారులు ఏకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఇందుకోసం డైట్ కళాశాల భూమిలో నుంచి రెండెకరాలను కేటాయించారు. నిర్మాణ పనులూ చకచకా జరుగుతున్నాయి.
విశాల ప్రాంగంణంలో విద్యాలయాలను ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రశాంత వాతావరణం. శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండటం. ఏ చిన్నపాటి అలజడి జరిగినా అది విద్యార్థుల దృష్టి మళ్లిస్తుంది. అందుకే వీలైనంత ఎక్కువ స్థలంలో విద్యాలయాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ భూమికి కొరత ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఒక్క కళాశాల ప్రాంగణంలో మరికొన్ని విద్యాలయాలను ఏర్పాటు చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎందుకంటే అవన్నీ విద్యా సముపార్జన కేంద్రాలే కాబట్టి. కానీ, చదువుతో సంబంధం లేని కార్యాలయాలను ఏర్పాటు చేయడంలో అధికారుల ఆలోచన అంతుచిక్కడం లేదు.
ఇప్పుడు ఏకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి పూనుకున్నారు. మార్కెట్ అంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో రైతులు వస్తుంటారు. ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యం తీసుకువస్తుంటారు. వాటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు వస్తుంటారు. వారూ ట్రాక్టర్లు, లారీలను తీసుకువస్తుంటారు. వాహనాల రాకపోకలు, క్రయవిక్రయాలతో కళాశాల ప్రాంగంణం ప్రశాంత వాతావరణం దెబ్బతినే అవకాశం ఉంది. విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతుంది. డైట్ ప్రాంగణంలోని బీఈడీ కళాశాల, బీసీ స్టడీ సర్కిల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంది. కొంత మందికి లబ్ధి చేకూర్చడం కోసం విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సబబు అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.






