దండకారణ్యం వదిలివెళ్లండి.. తెలంగాణ మావోయిస్టులకు ఆదేశాలు!

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-12 09:08:52  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: దండకారణ్యం(డీకే)లోని షెల్టర్ జోన్లను వదిలివెళ్లాల్సిందిగా తెలంగాణ మావోయిస్టులకు ఆ పార్టీ కేంద్ర కమిటీ దిశానిర్దేశం చేసింది. ఇక నుంచి తెలంగాణకు చెందిన ఆయా కమిటీలు, కేడర్ తమ తమ జిల్లాల్లోకి వెళ్లి ప్రజాసమస్యలపై పనిచేస్తూ పార్టీకి గత వైభవం తేవడం కోసం ప్రయత్నాలు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం వివిధ ప్రాంతాలకు కమిటీలను ఏర్పాటు చేసిన సీసీ ముందుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రిక్రూట్ మెంట్ కోసం చర్యలు చేపట్టాలని చెప్పింది. ప్రజలకు [&hellip;]</p>

దండకారణ్యం వదిలివెళ్లండి.. తెలంగాణ మావోయిస్టులకు ఆదేశాలు!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: దండకారణ్యం(డీకే)లోని షెల్టర్ జోన్లను వదిలివెళ్లాల్సిందిగా తెలంగాణ మావోయిస్టులకు ఆ పార్టీ కేంద్ర కమిటీ దిశానిర్దేశం చేసింది. ఇక నుంచి తెలంగాణకు చెందిన ఆయా కమిటీలు, కేడర్ తమ తమ జిల్లాల్లోకి వెళ్లి ప్రజాసమస్యలపై పనిచేస్తూ పార్టీకి గత వైభవం తేవడం కోసం ప్రయత్నాలు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం వివిధ ప్రాంతాలకు కమిటీలను ఏర్పాటు చేసిన సీసీ ముందుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రిక్రూట్ మెంట్ కోసం చర్యలు చేపట్టాలని చెప్పింది. ప్రజలకు దూరంగా ఉంటూ పార్టీ నిర్మాణం చేయడం అసాధ్యమని, ప్రాక్టికల్‌గా కనిపిస్తే తప్ప పట్టు సాధించలేమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కూడా పార్టీ నాయకత్వం సూచించింది. ఇక నుంచి ప్రతి యేటా వానలు పడినప్పటి నుంచి తిరిగి ఎండలు ముదిరి అడవిలో ఆకులు రాలేవరకూ అనగా జూన్ నుంచి మార్చ్ వరకు తెలంగాణ అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతూ పార్టీని బలోపేతం చేయాలని, కేవలం ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే దండకారణ్యాన్ని షెల్టర్‌గా వాడుకోవచ్చని వివరించింది.

ఏప్రిల్ వరకు డీకేకు నో ఎంట్రీ..
దాదాపు రెండు దశాబ్దాల క్రితం తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఇటీవల మావోయిస్టు పార్టీ సవరించుకుంది. ఇప్పటి వరకు దండకారణ్య అటవీ ప్రాంతంలోని సరిహద్దు ప్రాంతాన్ని తెలంగాణ కమిటీకి అప్పగించింది. తెలంగాణ ప్రాంతంలో చర్యలకు పూనుకున్న తరువాత ఆ ప్రాంతంలో షెల్టర్ తీసుకోవాలని కేంద్ర కమిటీ సూచించింది. దీంతో భద్రకాళి గుట్ట ప్రాంతంలో తెలంగాణాకు చెందిన మావోయిస్టులు షెల్టర్ తీసుకునే వారు. ఆ తరువాత జరిగిన పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సాయుధ దళాలన్నీ కూడా దండకారణ్యం ఏరియాలోని షెల్టర్ జోన్ కే పరిమితం అయ్యాయి. అయితే తాజాగా కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయంతో షెల్టర్ జోన్ ను తెలంగాణ కేడర్ వదిలిపెట్టక తప్పలేదు. అలా వచ్చిన మావోయిస్టులు ఆసిఫాబాద్ నుండి భద్రాద్రి జిల్లా వరకు ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నది పరివాహంలోని అడవులకు వచ్చి చేరారు.

ఇదే అదును అంటున్న పోలీసులు..
గతంలో నార్త్ తెలంగాణా ఏరియా పీపుల్స్ వార్‌కు పెట్టని కోటగా మారిన తరువాత ఏరివేయడం అసాధ్యమైందని, మళ్లీ ఇప్పడు సాయధ దళాల నిర్మాణం జరిగితే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మావోయిస్టులు వచ్చిన కొత్తలోనే, ఇంకా స్థానికంగా పట్టు రాకముందే వారికి చెక్ పెట్టేస్తే ముందు ముందు ఇబ్బందులు ఉండవని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు డీజీపీ సహా పోలీసు బాసులు మానిటరింగ్ చేస్తూ మావోల ఏరివేతపై స్పెషల్ గా రివ్యూ చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో గ్రే హౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇన్ ఫార్మర్ వ్యవస్థను అప్రమత్తం చేయడంతో పాటు అనుమానితులపై నిఘా వేశారు.
మరోవైపున మావోల ప్రభావం ఉండే అవకాశాలు ఉన్న ప్రాంతాలను పోలీసు అధికారుల పోస్టింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామగుండం కమిషనరేట్‌లో తాజాగా పోస్టింగ్ అయిన ఐపీఎస్ శరత్ చంద్ర పవార్‌కు ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీ బాధ్యతలు అప్పగించారు. కమిషనరేట్లలో ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్‌లకు మాత్రమే అడిషనల్ డీసీపీలుగా ఉండగా, రామగుండం కమిషనరేట్‌లో మాత్రం కొత్తగా ఆపరేషన్స్ వింగ్‌కు ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించడం ఇక్కడ గమనార్హం.

Next Story