ఘొల్లుమన్న గుంపుల.. ఒకే కుటుంబంలో ముగ్గురు హతం

by  |
maoists-died 1
X

దిశ, పెద్దపల్లి : ఆంధ్రా, ఒర్సిస్సా సరిహద్దు(AOB)లో చెలరేగిన అలజడితో ఆ పల్లె కన్నీటి సంధ్రంలో మునిగిపోయింది. దశాబ్దాలుగా విప్లవోద్యమ బాటలో నడుస్తున్న ఆ గ్రామ బిడ్డ ఎన్‌కౌంటర్‌లో హతం కావడం స్థానికులను విషాదంలోకి నెట్టింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గుంపులకు చెందిన సందె గంగయ్య అలియాస్ అశోక్ ఎన్ కౌంటర్‌లో హతమయ్యాడు. విశాఖ మన్యంలోని కొయ్యూరు ఆటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు నెలకొరగగా.. అందులో డీసీఎం కేడర్‌లో ఉన్న గంగయ్య కూడా మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వైద్యం అందించేందుకు..

మావోయిస్టు పార్టీ వైద్య విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న గంగయ్య తన సహచర మావోలకు వైద్యం చేసేందుకు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో గంగయ్య కూడా నేలరాలాడు.

ఒకే ఇంట ముగ్గురు..

విప్లవ పంథాలో వెళ్లి అడవులతోనే మమేకమై జీవనం సాగిస్తున్న ముగ్గురు అన్నదమ్ములు ఎన్‌కౌంటర్‌లోనే హతం అయ్యారు. 1992లో అడవి బాట పట్టిన గంగయ్య సొంత అన్న సందె రాజయ్య 1996లో ఓదెల గుట్ట వద్ద జరిగిన ఎదురు కాల్పల్లో మరణించగా.. మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌లో గంగయ్య హతం అయ్యాడు. వీరి కజిన్ సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ సీసీ మెంబర్‌గా పని చేస్తుండగా, 2007లో అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశాడు. విప్లవం కోసం ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు తమ జీవితాలను పణంగా పెట్టడం స్థానికులను కంట తడి పెట్టేలా చేసింది.



Next Story