ట్రాక్టర్ దొంగలిస్తున్నాడని చితకబాదిన గ్రామస్తులు.. ఆసుపత్రికి తరలిస్తుండగా..

302

దిశ, కామారెడ్డి : ట్రాక్టర్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన రాకేష్‌గా గుర్తించారు.

వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన రాకేష్ ఫుల్లుగా మద్యం సేవించి కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ట్రాక్టర్ నిలిపిన చోటుకు వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ట్రాక్టర్‌పైకి ఎక్కి ఆన్ చేసే ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడుతున్నాడని భావించి రాకేష్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. దీంతో రాకేష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అనంతరం స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా రాకేష్‌ను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.