రక్షణ వ్యవస్థలో.. మేడ్ ఇన్ ఇండియా

119

దిశ, ఫీచర్స్ : రక్షణ ఉత్పత్తుల స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూ, సైన్యం స్వయం సమృద్ధి సాధించేందుకు ‘ఆత్మనిర్భర భారత్‌’ నినాదంలో భాగంగా ఇండియా 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే 2022 నాటికి రక్షణ దిగుమతులను కనీసం 2 బిలియన్ డాలర్లు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా, రక్షణ రంగంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడానికి అనేక స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. భారతదేశంలో ఐడియాఫోర్జ్, టోన్‌బో ఇమేజింగ్, సిఎం ఎన్విరాన్‌సిస్టమ్స్, విజ్‌ ఎక్స్‌పర్ట్‌లు వంటి 194 డిఫెన్స్ టెక్ స్టార్టప్‌లు దేశ రక్షణ ప్రయత్నాలను శక్తివంతం చేయడానికి వినూత్న సాంకేతిక పరిష్కారాలను నిర్మిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) ద్వారా ఆయా ఆవిష్కరణలకు మద్దతు ఇస్తోంది. స్వయం ఆధారిత భారతదేశాన్ని సృష్టించడానికి మేడ్ ఇన్ ఇండియా సొల్యూషన్స్ అందిస్తున్న కొన్ని స్టార్టప్స్‌పై స్పెషల్ ఫోకస్..

టోరస్ రోబోటిక్స్ 

చెన్నైకి చెందిన టోరస్ రోబోటిక్స్‌ను ఎస్‌ఆర్‌ఎమ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థులైన విఘ్నేష్, విభాకర్ సెంథిల్ కుమార్, కె అభి విఘ్నేష్, 2019లో ప్రారంభించారు. భారత రక్షణ సేవల కోసం పూర్తిగా ఎలక్ట్రిక్ మానవరహిత గ్రౌండ్ వెహికల్స్(UGV) రూపొందిస్తూ, సాయధ దళాలకు సాయం చేస్తోంది. ఈ వెహికల్ ఆరు డిగ్రీల ఫ్రీడమ్ (6DOF)తో మూవ్ అవుతుండటంతో పాటు, ప్రాణాంతకమైన అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ గుర్తించి, పారవేసేందుకు రోబోటిక్ ఆర్మ్‌‌ కూడా కలిగి ఉంటుంది.

ఉగ్రవాదులు సెప్టెంబర్ 18, 2016న ఉరిలోని ఒక శిబిరం వద్ద గ్రెనేడ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ క్షణంలోనే ఈ యువకులు సైనికులకు సాయం చేయడానికి, వారి ప్రాణాలు రక్షించడానికి మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. అలా రోబోటిక్స్‌పై పట్టు సాధించి భారత రక్షణ వ్యవస్థకు అనుకూలమైన డిజిటల్ డివైజ్‌లు రూపొందిస్తున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) కోసం మొబైల్ అటానమస్ రోబోటిక్ సిస్టమ్ (MARS) యూజీవీని కూడా నిర్మించింది. 750 కిలోగ్రాముల పేలోడ్‌తో అధిక ఎత్తులో పనిచేసే ‘లాజిస్టిక్స్ యూజీవీ’ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లోనూ ఉత్తర కమాండ్ స్థావరాలకు లాజిస్టిక్స్ సరఫరా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు స్టార్టప్ ఇండియా గుర్తింపు పొందిన ఐడెఎక్స్-డియో(IDEX-DIO) ద్వారా ‘పయనీర్ డిఫెన్స్ ఇన్నోవేటర్’ అనే లేబుల్‌ను కూడా గెలుచుకుంది.

ఐరోవ్ (EyeROV) 

కొచ్చికి చెందిన ఐరోవ్ స్టార్టప్ ‘మెరైన్ రోబోట్స్’‌ను అభివృద్ధి చేయగా, అవి సముద్రగర్భంలో వివిధ పనుల కోసం ఉపయోగపడుతున్నాయి. రక్షణ, సముద్ర పరిశోధన సంస్థలు, షిప్పింగ్, చమురు, గ్యాస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్‌స్ట్రక్షన్ వంటి అనేక పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఇవి తోడ్పడుతున్నాయి. భూమి లేదా ఆకాశంలో తనిఖీతో పోల్చితే నీటి అడుగున సెర్చ్ చేయడం డైవర్ల, సైనికులకు సవాలుగా ఉంటుంది. ఎందుకంటే అధిక నీటి ప్రవాహాలు, పూర్ విజుబిలిటీ, మెరైన్ క్రియేచర్స్ వంటి ప్రతికూల వాతావరణం వారిని ఇబ్బంది పెడుతుంది. అంతే కాకుండా డైవర్స్ 30-40 మీటర్ల లోతు వరకు మాత్రమే డైవ్ చేస్తారు. ఇందుకు పరిష్కారంగా రిమోట్‌గా పనిచేసే వాహనం (ROV) ఈ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని వ్యవస్థాపకులు భావించారు. రోవ్ డ్రోన్ సముద్ర మట్టానికి 100-200 మీటర్ల దిగువకు వెళ్లి సమర్థంగా తనిఖీ నిర్వహిస్తుంది.

2019లో ఐడెక్స్ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్‌ని గెలుచుకున్న ఐరోవ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), కోస్టల్ పోలీస్, BSF, కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ, కేరళ పోలీస్, అస్సాం ఫైర్ అండ్ రెస్క్యూ కోసం 15 పైలట్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసింది. అంతేకాదు మెరైన్ ఆపరేషన్స్‌లో డేటా-లెడ్ రిపోర్టింగ్ కోసం వినూత్న రోవ్ డ్రోన్ పరిష్కారాలను రూపొందించింది.

విన్‌వెలి

చెన్నయ్‌కి చెందిన విన్‌వెలి అనే స్టార్టప్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రక్షణ మంత్రిత్వ శాఖ కింద ప్రత్యేక దళాల కోసం స్వదేశీ యూఏవీలు లేదా డ్రోన్‌లను నిర్మిస్తోంది. ఈ స్టార్టప్‌ను టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేస్ ఇంజనీర్ కంప్లీట్ చేసిన గోకుల్ ఆనంద యువరాజ్, అతని కళాశాల స్నేహితులు యువాన్ క్యూ, ఇషాన్ హాలకోటేతో కలిసి స్థాపించారు. యుద్ధభూమిలో సైనికుల ప్రాణాలను కాపాడటానికి ఈ డ్రోన్స్ సహాయపడతాయి. వీటిని కమెండో ముందు ప్లేస్ చేసి ఉంచడంతో, శత్రువు కాల్చినా ముందున్న యూఏవీకే ఆ బుల్లెట్ తగులుతుంది. విన్‌‌వెలీకి రెండు భారతీయ పేటెంట్లు కూడా ఉన్నాయి. దాని లాంచర్, ఫైరింగ్ సిస్టమ్స్ పూర్తిగా దేశీయంగా రూపొందించారు. ముడి పదార్థాలు కూడా స్థానికంగా లభించేవి ఉపయోగించారు.

ముంబైకి చెందిన ఐడియా ఫోర్జ్ స్టార్టప్ కంపెనీ రక్షణ, స్వదేశీ భద్రత, పారిశ్రామిక అప్లికేషన్స్ కోసం డ్రోన్‌ల తయారీలో పాలుపంచుకుంది. ఐడియాఫోర్జ్ డ్రోన్స్ భారత సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్ర పోలీసు దళాల్లో మోహరిస్తారు. ఇలా మరెన్నో స్టార్టప్స్ భారత రక్షణ దళాలకు అవసరమైన పరికరాలు అందించడంలో కృషి చేస్తున్నాయి. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం సైనిక రంగంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా, చైనా వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ఎస్‌ఐపీఆర్ఐ నివేదిక ప్రకారం భారత్ 2019లో రక్షణ రంగంలో 71 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. 2018లో చేసిన వ్యయంతో పోల్చితే ఇది 6.9 శాతం ఎక్కువ.
రక్షణ రంగంలో 2019లో చైనా 261 బిలియన్ డాలర్లు, అమెరికా 732 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. ఇప్పటివరకూ భారత్ అత్యధికంగా రష్యా నుంచి రక్షణ సామగ్రి కొనుగోలు చేస్తూ వస్తోంది. ఆ తర్వాత భారత్‌కు ఎక్కువ దిగుమతులు చేస్తున్న దేశాలో జాబితాలో అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వరుసగా ఉన్నాయి. కానీ రక్షణ‌శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో వచ్చే ఐదేళ్లలో భారీ మార్పులేమైనా వస్తాయా? రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధిని సాధించగలుగుతుందా చూడాలి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..