ఎల్ఆర్ఎస్ భారమవుతోంది..!

by  |
ఎల్ఆర్ఎస్ భారమవుతోంది..!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి:

రియల్టర్లు అక్రమంగా వెంచర్లు వేసి అడ్డగోలుగా ప్రజలకు విక్రయించారు. కష్టపడి పని చేసి పైసా పైసా కూడబెట్టి అగ్గువాకో… సగ్గువాకో ప్లాట్లు కొనుకున్నారు. అలా కొనుకున్న మధ్య తరగతి ప్రజలు ఎంతో ధీమాతో ఉన్నారు. కానీ, ప్రభుత్వం అన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టాలని నిబంధనలు తీసుకురావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో పనులు లేక… పస్తులుంటూ కాలం వెల్లదీస్తున్న ఈ సమయంలో ఎల్ఆర్ఎస్ అంటూ భయపెట్టడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేద, మధ్య తరగతి ప్రజలు కరోనా కాలంలో పనుల్లేక అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో ఎల్ఆర్ఎస్ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోకుంటే మళ్లీ సమయం ఇస్తారో లేదోనని ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా మొదట ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందా..? లేకపోతే అనుమతి ఇస్తారా..? అనే అనుమానాలు వస్తున్నాయి. రియల్ వ్యాపారులు తక్కువ ధరకు వచ్చిన వ్యవసాయ భూములను, వివాదంలో ఉన్న భూములను కొనుగోలు చేసి లే అవుట్లు నిర్మించారు. అంతేకాకుండా కొన్ని కొన్ని వెంచర్లు, లేఅవుట్లు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోనల్ పరిధిలో నిర్మించిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అనుమతి ఉండదు. అయితే ప్రజలు దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ కు అనుమతి వస్తే నిబంధనల ప్రకారం ప్లాట్లకు అనుమతి ఉన్నట్లు. లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసినట్లు స్పష్టమవుతుంది. దీంతో ప్రజలు దేవుడికి దండం పెట్టుకుని మరి దరఖాస్తులు చేసుకుంటున్నారు. భవిష్యత్ లో ప్లాట్లు క్రయ విక్రయాలు జరగాలంటే ఎల్ఆర్ఎస్ ఉండాల్సిందేనని ప్రభుత్వం చెప్తుండడంతో భారమైనా తప్పడం లేదని వాపోతున్నారు.

నాడు పట్టించుకోలే..

వ్యవసాయ భూములను ప్లాట్లుగా మారుస్తున్న సమయంలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేసి ఉంటే ఇప్పుడు ప్రజలపై భారం పడేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాడు అధికారులు, రియల్ వ్యాపారులు కుమ్మక్కై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు అదే అధికారులు అక్రమ లే అవుట్లకు రిజిస్ట్రేషన్లు జరగవు, నిర్మాణాలకు అనుమతులుండవని హెచ్చరికలు జారీ చేయడం ఎంత వరకు సమాంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇష్టానుసారంగా లే అవుట్లు చేస్తుంటే ఇన్నేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులు నోరు మూసుకున్నారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేయడంతో ప్రజలకే మంచిదని అధికార పార్టీ నేతలు ప్రచారం చేయడం సిగ్గు చేటని వాపోతున్నారు. ఆ పార్టీ నాయకులే అధికంగా వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించారు. వారే ప్లాట్లు చేసినప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టి ఉంటే ఇప్పుడు మాకు ఈ కష్టాలు తప్పేవని అంటున్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో సుమారుగా 250వరకు లేఅవుట్ల ఉన్నాయి. ఇందులో 240 వరకు ఎల్ఆర్ఎస్ అనుమతి లేదని అధికారులే వివరిస్తున్నారు. మొత్తం ప్లాట్లు 6వేల వరకు ఉండొచ్చునని, ఇందులో 5,520 ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ లేదు. అంతేకాకుండా ఎల్ఆర్ఎస్ అనుమతి లేకుండానే మిగిలిన ప్లాట్ల యజమానులు ఇండ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం 4,750మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారి స్పష్టం చేస్తున్నారు.

సామాన్యులకు తిప్పలు..

ఎన్నో ఏండ్ల కింద ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇప్పటి ధరలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించమనడం సమంజసం కాదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఐదేండ్ల కింద దేవగిరి రాజు ప్లాటు కొనుగోలు చేసుకున్నాడు. అప్పుడు మార్కెట్ ధర గజానికి రూ.1500వరకు ఉంటే ప్రభుత్వం ధర గజానికి రూ.250 ఉంది. ఆ వ్యక్తి ప్రభుత్వం ధర ప్రకారం గజానికి రూ.250 చొప్పున 100గజాలు కొనుగోలు చేశాడు. అతను రూ.25వేలు చెల్లించి కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు రూ.13,500 ఖర్చు అవుతుంది. కొనుగోలు చేసినప్పుడు ఉన్న ప్రభుత్వ ధర ప్రకారం 14శాతం, ప్రస్తుతం ప్రభుత్వ ధర ప్రకారం 20శాతం నగదు ఫీజు చెల్లించాలని సూచిస్తుంది. అయితే ఎప్పుడు కొనుగోలు చేశారో అప్పటి ధరతో లెక్కించాలి. లేకపోతే ప్రస్తుత ధర ప్రకారం లెక్కించి ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే బాగుటుంది. కానీ రెండు విధాలుగా విభజించి ప్రభుత్వం నగదు చెల్లించమని చెప్పడంతో సామాన్యులకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు.

గతంలో కొనుగోలు చేసిన వాటిని మినహాయించాలి

గతంలో కొనుగోలు చేసిన ప్లాట్లు, ఇండ్లను ఎల్ఆర్ఎస్ నుంచి మినహాయించాలి. ప్రస్తుతం నూతనంగా కొనుగోలు చేసే వాటికి ఇది వర్తింపజేయాలి. అన్ని అనుమతులు తీసుకున్న పిదపనే వెంచర్లలో ప్లాట్లు విక్రయించేందుకు అనుమతించాలి. దీంతో కొనుగోలుదారులు ఇబ్బందిపడే అవసరం ఉండదు. అసలే కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ గుదిబండగా మారింది.
–మంచిరేవుల అశోక్, షాద్‎నగర్

మానవతాదృక్పథంతో ఆలోచించాలి

ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచించాలి. క్రమబద్ధీకరణ చేయని స్థలాలను విక్రయించిన రియాల్టర్లు బాగానే ఉన్నారు. కాని రిజిస్ట్రేషన్ చేసుకున్న సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లకు ఇప్పడు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టమని చెప్పడం దారుణం. తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్ కు ఎక్కువ ఫీజు చెల్లించాల్సి వస్తోంది.
–దేవగిరి రాజు, షాద్‎నగర్

విశేష స్పందన వస్తోంది

మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 4,750 వరకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంకా 600వరకు దరఖాస్తులు వస్తాయని అనుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు ప్రజలకు ఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. ఆర్థికంగా భారమైనప్పటికీ దరఖాస్తు చేసుకుంటున్నారు.
–లావణ్య, మున్సిపల్ కమిషనర్, షాద్‎నగర్


Next Story

Most Viewed