ప్రియుడికి వేరొక యువతితో పెళ్లి.. ప్రియురాలు ఆత్మహత్య.. ప్రియుడు కూడా

by  |
lovers-suicide
X

దిశ, ఏపీ బ్యూరో: ఆ ఇద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే కులాలు వేరుకావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. యువకుడికి బలవంతంగా మరో యువతితో పెళ్లి చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు రెండు రోజులక్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు మానసిక క్షోభకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా కురిచేడు మండలం దేకనకొండలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేకనకొండ గ్రామానికి చెందిన పాతకోట వెంకటేశ్వర్లు (24) అదేగ్రామానికి చెందిన యువతి (24) ఇద్దరూ పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే యువతి ఉన్నత చదువుల నిమిత్తం గుంటూరుకు వెళ్లింది. అరండల్‌పేటలో హాస్టల్లో ఉంటూ డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. వెంకటేశ్వర్లు స్వగ్రామంలోనే ఉంటూ వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ ఇద్దరూ ప్రేమించుకుంటూనే ఉన్నారు. అయితే ఈప్రేమ వ్యవహారం బయటపడటంతో వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు మందలించి, కులాలు వేరు కావడంతో పెళ్లి చేసేది లేదని తేల్చి చెప్పేశారు.

పెళ్లి చేస్తే ఆ యువతిని మరచిపోతాడని భావించిన కుటుంబ సభ్యులు మూడు నెలల క్రితం వెంకటేశ్వర్లుకు వేరే యువతితో పెళ్లి చేసేశారు. వెంకటేశ్వర్లు వివాహం చేసుకున్న విషయం తెలిసి బాధతో హాస్టల్‌కు వెళ్లి నవంబర్ 8న ఉదయం గుంటూరులో తాను ఉండే హాస్టల్‌ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు మంగళవారం పొలం నుంచి వచ్చి స్వగృహంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పొలం నుంచి సాయంత్రం వచ్చి చూసే సరికి వెంకటేశ్వర్లు విగతజీవిగా ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed