హుజురాబాద్‌లో జోరుగా ప్రలోభాల పర్వం.. నేరుగా నగదు బదిలీ

by  |
huzurabad by poll
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్​ ఉప ఎన్నికలో భాగంగా లీడర్లను పంచుకోవడం పూర్తి అయింది. నిన్నటిదాకా ఒక పార్టీ జెండా ఎత్తుకున్నోళ్లు ఉప ఎన్నికల పుణ్యమా అని పార్టీలు మారారు. ఎర్రన్నలు కాషాయ జెండా మోస్తున్నారు. కాషాయ జెండా మోసినవారు గులాబీ జెండా అందుకున్నారు. మొత్తానికి ఈటల రాజేందర్​ను ఓడించాలనే టీఆర్​ఎస్​ లక్ష్యానికి హుజురాబాద్​ సెగ్మెంట్​ లీడర్లకు కలిసి వచ్చింది. మరో పది రోజుల్లో పోలింగ్​ ప్రక్రియ ఉండటంతో.. పార్టీలన్నీ గ్రామాలు, వీధుల్లో ఓట్ల కోసం వేట సాగిస్తున్నాయి. నిన్నటిదాకా లోకల్​ లీడర్లను నమ్ముకున్న పార్టీలన్నీ ఇప్పుడు అమాత్యుల నుంచి మొదలుకుని కీలక నేతల వరకు వీధిస్థాయికి వెళ్లి ఓటర్లను కలిసేందుకు ప్లాన్​ వేస్తున్నారు.

ఇదే అసలు సమయం

ఈ పది రోజుల్లో ఓటర్లను మల్చుకోవడం కీలకంగా భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ, టీఆర్​ఎస్​ మధ్య పోటీ ఉన్నా.. కాంగ్రెస్​ కూడా ఎంతో కొంత ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారపర్వాన్ని యుద్ధరీతిన సాగిస్తున్నాయి. మంత్రులు అక్కడే మకాం వేశారు. బీజేపీ నుంచి కీలకమైన నేతలు కూడా వస్తున్నారు. రెండు రోజుల నుంచి కాంగ్రెస్​ పార్టీ సీనియర్లు సైతం ప్రచారపర్వాన్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో గల్లీ స్థాయి నుంచి ఓట్లను ఎలా రాబట్టుకోవాలనే ప్లాన్​ వేసుకుంటున్నారు.

లీడర్లను వదిలేశారు

ఇప్పటి వరకు స్థానిక నేతలపై దృష్టి పెట్టిన టీఆర్​ఎస్​, బీజేపీ.. ఇప్పుడు లీడర్లను వదిలేసింది. లీడర్లతో అనుకున్న స్థాయిలో ఓట్లు వస్తాయా.. రావా అనే అనుమానాలతో గ్రామాల్లో పోలింగ్​ బూత్​ల వారీగా ఓటరు జాబితాను పట్టుకుంటున్నారు. గతంలో మహిళా సంఘాలు, గ్రామైక్య సంఘాలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పార్టీలు.. ఇప్పుడు వారందరినీ కాదని నేరుగా రంగంలోకి దిగుతున్నాయి. గ్రామస్థాయిలో మంత్రులు, ఆ స్థాయి నేతలే అభ్యర్థుల తరుపున ఓటర్లతో మాట్లాడుతున్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు ఈ హుజురాబాద్​లో ప్రత్యేక రాయితీలే అందిస్తున్నారు. ఇక పోలింగ్​ బూత్​ల వారీగా ఓటరు జాబితా ప్రకారం గంపగుత్తగా ఓట్లను మల్చుకునేందుకు బేరాలాడుతున్నారు. ఇప్పటి వరకు స్థానిక నేతలకు ఎంతో కొంత ముట్టచెప్పినా.. అవి ఓటర్ల వరకు చేరడం లేదనే కారణంతో నేరుగా ఓటరు జాబితా పట్టుకుని వీధుల్లో తిరుగుతున్నారు.



Next Story

Most Viewed