హుజురాబాద్ క్లైమాక్స్.. రంగంలోకి పెద్ద తలకాయలు

by  |
హుజురాబాద్ క్లైమాక్స్.. రంగంలోకి పెద్ద తలకాయలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ విమర్శలనే ప్రధాన అస్త్రాలుగా మార్చుకుంటున్నాయి. ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ వాతావరణం ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తయితే ఇక నుంచి చేయాల్సింది భిన్నంగా ఉండనుంది. పోలింగ్ శాతం పెరిగేలా, పరిస్థితుల్ని అనుకూలంగా మల్చుకునేలా టీఆర్ఎస్ స్పెషల్ స్ట్రాటజీ రూపొందించింది. బూత్ స్థాయిలో ఐదుగురితో కమిటీలను ఏర్పాటు చేసింది. పోలింగ్ రోజున ఆ బూత్‌కు చెందిన ఓటర్లందరినీ రప్పించే టాస్కును పార్టీ నాయకత్వం అప్పగించింది. బీజేపీ సైతం వారం రోజుల పాటు కనీసం డజను మంది కేంద్ర మంత్రులను ప్రచారంలోకి దింపాలనుకుంటున్నది. కేసీఆర్ సభకు ధీటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సైతం భారీ సభ నిర్వహించేందుకు నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారు.

కేంద్రం వైఫల్యాలపై టీఆర్ఎస్ ఫోకస్

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నందున టీఆర్ఎస్ తన ప్రచార వ్యూహాన్ని మార్చింది. దళితబంధు ప్రస్తావనను దాదాపుగా తగ్గించింది. రైతుబంధు, ఆసరా పింఛన్ల వంటి పథకాల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నది. దీనికి తోడు నెగెటివ్ ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను తెరపైకి తెస్తున్నది. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదల, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయంపై టీఆర్ఎస్ నేతలు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకుని రావాలంటూ మంత్రి హరీశ్‌రావు పిలుపునిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానిస్తున్నారు. ఈటల రాజేందర్ తన స్వార్థం కోసం ఉప ఎన్నికకు తెరలేపారని హరీశ్‌రావు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకోవైపు బీజేపీ విధానాలను తూర్పారపడుతున్నారు.

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌కు ఈటల సవాళ్లు

బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్ ఇప్పటిదాకా ఒంటరిపోరే సాగించారు. బీజేపీ నేతలు పెద్దగా ప్రచారం చేసేందుకు రాలేదు. ఇన్‌చార్జిగా ఉన్న జితేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మినహా పెద్ద నేతలంతా ప్రచారానికి దూరంగానే ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం అడపాదడపా ప్రచారం చేశారు. ఈటల ఏకంగా సీఎంపైనే అస్త్రాలు సంధిస్తున్నారు. తనతో తలపడడానికి నేరుగా పోటీ చేస్తారా? అంటూ కేసీఆర్‌కు, హరీశ్‌రావుకు సవాల్ విసురుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మొత్తుకున్నా ప్రభుత్వం పైసలు విడుదల చేయలేదని, పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

రంగంలోకి కేంద్ర మంత్రులు

ఈ నెల 21 నుంచి బీజేపీ నేతలు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించడానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. కనీసం డజను మందిని పిలవాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు కేంద్రంపై టీఆర్ఎస్ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రులతోనే బీజేపీ సమాధానం చెప్పించాలనుకుంటున్నది. ఏయే పథకానికి కేంద్రం ఎంతమేర సహకారం అందించిందో.. రాష్ట్రం దాన్ని తన ఖ్యాతిగా ఎలా ప్రచారం చేసుకుంటున్నదో వారి నోటితోనే చెప్పించాలనుకుంటున్నది. ఇప్పటిదాకా ఈటలకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను మరింత మెరుగుపర్చుకునేలా అధికార పార్టీపైన నెగెటివ్ ప్రచారాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. వీరితో పాటు ఎంపీ అరవింద్, విజయశాంతి, డీకే అరుణ తదితర నేతలంతా ఇక్కడే పూర్తి టైం కేటాయించనున్నారు.


Next Story

Most Viewed