ఆదాయానికి గండి కొట్టిన ధరణి!

by  |
ఆదాయానికి గండి కొట్టిన ధరణి!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి వంద రోజులు దాటింది. కరోనా సమయంలో ఖజానాకు ఆదాయం పడిపోయింది. నెలకు సగటున వెయ్యి కోట్ల రూపాయలు ఆర్జించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకు రూ. 1,600 కోట్లు కూడా దాటలేదు. ప్రజలకూ ఇబ్బందులు తప్పలేదు. వ్యవస్థ ఎప్పటికి కోలుకుంటుందో అంతుచిక్కడంలేదు. శుక్రవారం ఏ జిల్లాలోనూ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ కాలేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సర్వర్ డౌన్ సమస్య వెంటాడుతోంది. సమస్యలు ఉన్నాయని స్వయంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అంగీకరించారు. వారం రోజులలో సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చక్కదిద్దే పనులు ఎంతగా జరుగుతున్నా ఫలితాలు అంతంతమాత్రమే. స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగుతున్నారు. శనివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైకోర్టు వెలువరించిన ఉత్తర్వుల మేరకు ఇకపైన ఎలా వ్యవహరించాలన్నదానిపై సీఎం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

స్పందన లేదు

సెప్టెంబరు ఎనిమిది నుంచి రిజిస్ట్రేషన్లను ఆపేసిన ప్రభుత్వం వారం రోజుల క్రితం పునరుద్ధరించాలని భావించింది. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పెద్దగా స్పందన లేదు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. హైకోర్టు ఈ అంశంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాలుగైదు రోజులుగా జరుగుతున్న ప్రక్రియకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది. సమస్య తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంఘం రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, బిల్డర్లు తదితరులతో సమావేశమైంది. ఆచరణలో ఎదుర్కొంటున్న సమస్యలను వారు అధికారులకు, మంత్రికి మొరపెట్టుకున్నారు. వారం రోజులలో అన్నీ పరిష్కారమవుతాయని, సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వనగరంగా ఎదుగుతోందని, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హైదరాబాద్ నగరంలో చాలా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రకటన చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మెరుగుపడలేదు.

ఆయన ఎందుకు రాలేదో

నిజానికి మంత్రి కేటీఆర్‌కు ఈ సంఘాల ప్రతినిధులతో మంచి సంబంధాలే ఉన్నాయి. టీఎస్ బీపాస్ సందర్భంగా వారితో పలుమార్లు సమావేశమయ్యారు. కరోనా సమయంలో ఉత్సాహాన్ని నింపేందుకు సంప్రదింపులు జరిపారు. గురువారం సమావేశానికి మాత్రం ఆయన హజరుకాలేదు. ధరణి లోపాలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సమావేశంలోనూ ఇవే అంశాలను ప్రస్తావించారు. వారి ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పుకోవడం కష్టమనే ఉద్దేశంతోనే గైర్హాజరు అయ్యి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఆర్థిక వనరులు పూర్తిగా తగ్గిపోయిన సమయంలో ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాలకు పూర్తిగా అప్పులపైనే ఆధారపడింది. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హెలికాప్టర్ మనీ’ ప్రతిపాదన చేశారు. కానీ అది సాకారం కాలేదు. చివరకు షరతులతో ఎఫ్ఆర్‌బీఎంకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. కేంద్రం నుంచి పెద్దగా ఆర్థిక సాయం రాకపోవడంతో ద్రవ్య సంస్థల నుంచి స్టేట్ డెవలప్‌మెంట్ లోన్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. అన్‌లాక్ సడలింపులతో ఆర్థిక వనరులు సమకూరుతాయనుకున్న సమయంలో సజావుగా సాగుతున్న రిజిస్ట్రేషన్‌లపై ధరణి దెబ్బకొట్టింది. నెలకు వెయ్యి కోట్ల రూపాయలు వచ్చే దారి కూడా మూసుకుపోయింది.

ఫలితం లేదు

ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. హైకోర్టు ఆంక్షలు, ప్రజల నుంచి వ్యతిరేకత, కొత్త సాఫ్ట్‌వేర్‌తో వస్తున్న తిప్పలు. ఇవన్నీ ప్రభుత్వానికి, ప్రజలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన సెట్‌బ్యాక్‌తో రాజకీయ అనిశ్చితిని చక్కదిద్దుకోవడం, వరద సాయానికి, రైతుబంధు అవసరాలను నిధులను సమకూర్చుకోవడం, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ సజావుగా జరిగేందుకు మార్గాలను వెదకడం ఇవన్నీ ముఖ్యమంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పటికి గాడిన పడుతుందో అటు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకూ తెలియదు, ఇటు ప్రధాన కార్యదర్శికీ స్పష్టత లేదు, మరోవైపు స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలకూ తెలియదు. అగమ్యగోచరంగా మారిన ఈ పరిస్థితులు మళ్ళీ గాడిన పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ధరణితో సంబంధం లేకుండా మళ్ళీ పూర్తిగా పాత ‘కార్డ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ జరుగుతుందా లేక ధరణిని చక్కదిద్ది మళ్ళీ మొదలుపెడతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలో దీనిపై స్పష్టత వస్తుందేమోననే ఆశలు చిగురిస్తున్నాయి.



Next Story