కరోనా.. మిడతల దాడిని సూర్య ముందే ఊహించారా?

64

దిశ, వెబ్ డెస్క్: ఏదైనా వింత జరిగితే.. వెంటనే అది బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని అంటుంటారు. అయితే.. కొంతమంది ఫ్యూచర్‌లో రాబోయే ఉపద్రవాలను ముందే ఊహిస్తారు. అందులో ముఖ్యంగా రచయితలు, సినీ దర్శకులు కూడా ఉంటారు. వాళ్లు తీసిన సినిమాలు చూసినా, రాసిన నవలలు, కథలు చదివినా.. వాస్తవ పరిస్థితులు మన కళ్లముందు కదలాడుతాయి. అలా ఇప్పటికే కరోనా పై కొన్ని సినిమాలు హాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ లో వచ్చాయి. తాజాగా మిడతల దండుపై కూడా తెలుగు, తమిళ భాషలో రూపొందిన ఓ సినిమా గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. అయితే కరోనా, మిడతల దాడుల గురించి ముందే ఊహించిన రెండు సినిమాలు కూడా సూర్య నటించినవి కావడమే ఇక్కడ విశేషం.

మలయాళంలో వచ్చిన వైరస్, హాలీవుడ్‌లో వచ్చిన కాంటేజియన్ సినిమాలు చూస్తే.. వైరస్ ఎలాంటి భయానక వాతావరణాన్ని సృష్టించిందో తెలుస్తుంది. వీటిని చూస్తుంటే.. కరోనా వైరస్ గురించి వీరికి ముందే తెలుసా? అన్న అనుమానం కలగక మానదు. అలానే సూర్య నటించిన ‘సెవెన్త్ సెన్స్’ సినిమా కూడా వైరస్ నేపథ్యంలోనే ఉంటుంది. ఇది కూడా చైనా నుంచే ఇండియాకు వ్యాపిస్తుంది. 2011 లో వచ్చిన ఈ సినిమా 2020లో ప్రస్తుతం మన ఎదుర్కొంటున్న సమస్యలను చూపించింది. గత ఏడాది సూర్య నటించిన మరో సినిమా ‘బందోబస్త్’. నెట్టింట్లో ఈ సినిమా వీడియోలు వైరల్ గా మారాయి. ఎందుకంటే.. ఈ సినిమాలో ‘మిడతల దండు దాడి’ గురించి ముందే చర్చించారు. ఓ ప్రాంతంలో పంటపొలాలను నాశనం చేసి మైనింగ్ పరిశ్రమను నెలకొల్పడం కోసం విలన్ మిడతల దండును ప్రయోగిస్తాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉండే పంట పొలాలన్నీ మిడతల బారిన పడతాయి. రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. మిడతలు పంట పొలాలపై ఎలా దాడి చేస్తాయి, వాటివల్ల దేశానికి ఎంత నష్టం వాటిల్లుతుందో అనేది ఈ సినిమాలో చూపించారు. ఇలా సూర్య నటించిన రెండు సినిమాల్లో రెండు విపత్తుల గురించి చూపించడం తో సోషల్ మీడియాలో సూర్య సినిమాలు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. నటుడు సూర్య కు ఈ విషయం ముందే తెలుసా.. ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రల్లో వీటి దాడుల ప్రభావం తీవ్రంగా ఉంది. మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా వీటి దాడుల జరగవచ్చని ఊహించిన ప్రభుత్వం.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోనే మిడతల దండు ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..