ఫర్నీచర్ షాపులు వెలవెల.. 70 శాతానికి పడిపోయిన అమ్మకాలు

by  |
Furniture shop
X

దిశ, తెలంగాణ బ్యూరో : లాక్ డౌన్ కారణంగా ఫర్నీచర్ షాపులకు పెద్ద దెబ్బ పడింది. అమ్మకాలు లేక నిర్వాహకులు విలవిల్లాడిపోతున్నారు. ఎలాంటి బిజినెస్ లేక అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. గతంలో ఫర్నీచర్ కొనుగోళ్లు భారీగా జరిగేవి. కస్టమర్లు తమకు కావాల్సిన డిజైన్ ఫర్నీచర్ కావాలంటే కనీసం వారానికి పైగా సమయం పట్టేది. కరోనా కారణంగా కొనేవారు లేక వ్యాపారమే లేకుండా పోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కస్టమర్లు ఫర్నీచర్ ఆర్డరిస్తే సాయంత్రానికల్లా.. లేదా మరుసటి రోజుకే ఇస్తామన్నా ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని వాపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా తమ బిజినెస్ 70 శాతానికి పడిపోయినట్లు వారు చెబుతున్నారు.

లాక్ డౌన్‌తో బిజినెస్ డౌన్

గతంలో రోజుకు రూ.లక్ష జరిగిన బిజినెస్ కరోనా కారణంగా కుప్పకూలిపోయింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం వల్లఎలాంటి వ్యాపారం జరగలేదని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. అనంతరం మరోసారి లాక్ డౌన్ వేళల్లో మార్పులు చేస్తూ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమయం కల్పించడంతో కొంత ఊరట లభించినట్లయిందని వ్యాపారులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రతిరోజు రూ.లక్ష జరిగే బిజినెస్ రూ.25 వేలకు పడిపోయినట్లు ఫర్నీచర్ షాపుల నిర్వాహకులు వెల్లడించారు. ఫస్ట్ వేవ్ అనంతరం లాక్ డౌన్ ఎత్తివేయడంతో వ్యాపారం కొంత పుంజుకున్నా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందడంతో మళ్లీ బిజినెస్ డల్ అయింది.

Furniture shop2

శుభకార్యాల వాయిదాతో మరింత నష్టం

పెళ్లిళ్ల సీజన్ లో ఫర్నీచర్ షాపులకు ఫుల్ గిరాకీ ఉంటుంది. మంచి ముహూర్తాలు ఉన్న సమయంలో కొవిడ్ విజృంభించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం జనజీవనంపై పలు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల శుభకార్యాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పెండ్లిళ్లకు సైతం బ్రేక్ పడింది. నలభై మందికే అనుమతి ఇవ్వడంతో చాలామంది పెళ్లిలను వాయిదా వేసుకున్నారు. పెట్టిపోతలు లేక ఎలాంటి వ్యాపారం జరగకపోవడంతో ఫర్నీచర్ షాపుల నిర్వాహకులు భారీగా నష్టాలను చవిచూశారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉండటంతో షాపుల అద్దె చెల్లించేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. గతంలో శుభకార్యాలకే కాదు ఎలాంటి ఫర్నీచర్ కావాలన్నా కనీసం వారానికి పైగా సమయం పట్టేదని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎప్పటికప్పుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎవరూ కొనేందుకు ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బందికి ఇబ్బందులు

Furniture shop3

వ్యాపారం అంతంతమాత్రంగానే ఉండటంతో ఫర్నీచర్ షాపుల్లో పనిచేసే సిబ్బందికి ఇబ్బందులు తప్పడంలేదు. సకాలంలో వేతనాలు లేక, ఇచ్చినా పూర్తిస్థాయిలో అందక నానా ఇబ్బందులు పడుతున్నట్లు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కుటుంబాలను పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో అటు యాజమాన్యాన్ని అడగలేక, పని వదిలేసి బయటకు వెళ్లలేక సిబ్బంది ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఫర్నీచర్ షాపుల్లో పనిచేసే సిబ్బంది.

అద్దె కట్టలేకపోతున్నాం

Santhosh

లాక్ డౌన్ కారణంగా బిజినెస్ లేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం అద్దె కట్టలేని పరిస్థితికి మా పరిస్థితి దిగజారిపోయింది. బ్యాంకుల్లో లోన్లు కట్టాల్సి ఉంది. అవన్నీ పెండింగ్ పడిపోయాయి. లాక్ డౌన్ సడలింపు సమయం పెంచినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. రెండేళ్లు శుభకార్యాల సీజన్ ను కోల్పోయాం. ఏడాదిన్నర కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ బాధలు పడాలో అర్థం కావడంలేదు.
– సంతోష్, వ్యాపారి, నాంపల్లి

జీతాలు తగ్గి ఇబ్బందులు పడుతున్నాం..

Amzad

గతేడాది మార్చిలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అప్పటినుంచి వ్యాపారం జరగడంలేదు. సెకండ్ వేవ్ కు ముందు కొంత పుంజుకున్నా తిరిగి సెకండ్ వేవ్ వీర విజృంభణ చేసింది. గతేడాది ఫస్ట్ వేవ్ సమయం నుంచి వేతనాలు తగ్గించి ఇస్తున్నారు. యాజమాన్యం కూడా ఇబ్బందులు ఉండటంతో చేసేదేం లేక ఊరుకున్నాం. ఈ పని కాకుండా వేరే పనికి వెళ్దామన్నా ఎక్కడా దొరికేలా లేదు. అందుకే ఇదే పనిలో కొనసాగుతున్నా. ఉన్న కొంతలో తిని బతుకుతున్నాం.
– అంజద్, ఫర్నీచర్ షాపు సిబ్బంది



Next Story