Lockdown in Telangana : తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ పొడగింపు?

by  |
Lockdown in Telangana : తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ పొడగింపు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పటికే ఒక దఫా లాక్‌డౌన్‌ను వారం పాటు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించాలని భావిస్తున్నది. లాక్‌డౌన్ తర్వాత వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడం, కొత్త కేసులు తగ్గిపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ఫలితాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో జూన్ 8 లేదా 10వ తేదీ వరకు పొడిగించాలనుకుంటోంది. వైద్యారోగ్య శాఖ సైతం కనీసంగా వారం రోజుల పాటు పొడిగిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెల చివర్లో పరిస్థితిని విశ్లేషించి మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కానీ ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ తదితరాలకు మాత్రం లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలున్నట్లు ఇప్పటికే సంకేతాలు వెళ్ళాయి.

తమిళనాడు, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే ఒక వారం పాటు పొడిగిస్తూ ఈ నెల చివరి వరకూ లాక్‌డౌన్ కొనసాగేలా నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పెట్టిన తర్వాత కేసులు అదుపులోకి వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటోంది. సెకండ్ వేవ్‌లో గరిష్టంగా పది వేల మార్కును దాటి కొత్త కేసులు నమోదుకాగా లాక్‌డౌన్ అమలుతో తాజాగా ఆదివారం సాయంత్రానికి కేవలం 2,242 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా 50 మార్కు నుంచి ఇరవై లోపే నమోదయ్యాయి. జూన్ నెల చివరికల్లా మళ్ళీ డబుల్ డిజిట్‌లోకి తీసుకురావాలని వైద్యారోగ్య శాఖ ప్లాన్ చేసుకుంది. ఆ ప్రకారం కనీసంగా వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించడం ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చని భావిస్తోంది.

ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల రోజువారీ ఆదాయ వివరాలను కూడా ఆర్థిక శాఖ విశ్లేషిస్తూ ఉంది. లాక్‌డౌన్ విధించినప్పటికీ నాలుగు గంటల పాటు సడలింపు ఇవ్వడంతో ఏ మేరకు వ్యాపారం జరుగుతోంది, పన్నుల రూపంలో రాష్ట్రానికి ఎంత సమకూరుతోంది, ప్రతీ నెలా రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం జరుగుతోంది లాంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉంది. జూన్ మొదటి వారం వరకూ లాక్‌డౌన్ కొనసాగే అవకాశం ఉందని ఒకవైపు సంకేతం ఇస్తూనే ఆ మేరకు ఖజానాకు దెబ్బపడే అవకాశం ఉందో లెక్కలేస్తూ ఉంది.

మొదటి విడత లాక్‌డౌన్ ఈ నెల 13 నుంచి అమల్లోకి రాగా దాని ద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించి, పొరుగున ఉన్న రాష్ట్రాల్లోని వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా రకరకాల పేర్లతో రోడ్లమీద వాహనాలు తిరగడాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్ కఠినంగా అమలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో శనివారం నుంచి కంట్రోల్ లోకి వచ్చింది. ఇదే తరహాలో ఇంకో వారం రోజులు పొడిగించినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని వైద్యారోగ్య శాఖ అధికారులు అభిప్రాయం మేరకు సూచనప్రాయంగా ఆ దిశగా నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ నెల 28 లేదా 29 తేదీల్లో సీఎం సమీక్ష నిర్వహించి అప్పటి తాజా పరిస్థితులకు అనుగుణంగా పొడిగించడమా లేక నిలిపివేయడమా అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటికి పొరుగు రాష్ట్రాల్లో కేసులు, అక్కడి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై తీసుకునే నిర్ణయాలు కూడా తెలంగాణ సర్కార్ ఒక స్పష్టతకు రావడానికి దోహదపడనుంది.


Next Story