బాబా.. భూములపై వీళ్లేంటి.. ఛీఛీ!

by  |
బాబా.. భూములపై వీళ్లేంటి.. ఛీఛీ!
X

-నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్

దిశ, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నేతల భూ దాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికార బలంతో ప్రజాప్రతినిధులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. బినామీల పేర అమాయకుల భూములను ఆక్రమించుకుంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. బాధితులు న్యాయం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. స్థానిక ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతోనే పోస్టింగ్ తెచ్చుకున్న అధికారులు అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారు. పైగా, పెద్దవాళ్లతో గొడవలెందుకంటూ బాధితులను పరోక్షంగా బెదిరిస్తూ..రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తు్న్నారు. దీంతో రెచ్చిపోతున్న అధికార పార్టీ నాయకులు ఎలాంటి భూములైనా కొల్లగొట్టేందుకు వెనకాడటం లేదు.

బాబా భూములకు ఎసరు..

కర్నూల్ జిల్లా వాస్తవ్యులైన బాలసాయిబాబా హైదరాబాద్ దోమలగూడలో తన పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. వరంగల్ రూరల్ జిల్లాతో పాటు జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం మండెలగూడెంలో స్థానిక రైతుల నుంచి 58 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూములకు సంబంధించి బాల సాయిబాబా పేరిట పాస్ పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. 2017లో బాబా చనిపోవడంతో ట్రస్ట్ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామారావు అనే వ్యక్తి ఆ భూములను విక్రయించి సొమ్ము చేసుకోవాలని పన్నాగం పన్నినట్లు తెలిసింది. బాబాకు వారసులు ఉండటంతో సాధ్యం కాదని తెలిసి వక్రమార్గాలు అన్వేషించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే జనగామ నియోజకవర్గం నర్మెట మండలంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ప్రజా ప్రతినిధుల కన్ను బాబా భూములపై పడింది. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ల సాయంతో వారు రామారావును కలిసి నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. కొద్దిరోజుల కిందటే ఆ ఇద్దరు నాయకులు సుమారు 50 మందికి పైగా అనుచరులను వెంట బెట్టుకుని జేసీబీ సాయంతో భూముల వద్దకు వెళ్లి చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. బాబా భూములతో మీకేం సంబంధమంటూ స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నాయకులు పోలీసులను సైతం మేనేజ్ చేసినట్లు సమాచారం.

నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్

బాలసాయిబాబా మరణం తర్వాత మండలగూడెం భూములకు ఆయన వారసులు నిజమైన హక్కుదారులు. కానీ బాబా ట్రస్ట్ బాధ్యతలు చూస్తున్న సీఈవో రామారావు నకిలీ పత్రాలు సృష్టించి నర్మెటకు చెందిన టీఆర్ఎస్ నేతలకు విక్రయించినట్లు సమాచారం. స్థానికులు కావడంతో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారనే ధీమాతో రామారావు..బాబా భూములను అతి తక్కువ ధరకే వారికి విక్రయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాల సాయిబాబా మండలంగూడెంలో ఎవరి వద్ద నుంచి భూములు కొనుగోలు చేశారో ప్రస్తుతం వారి వారసులు మాకే ఆ భూములు చెందుతాయంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అవసరమైతే ఆ భూములు మేమే కొనుగోలు చేస్తామంటున్న గ్రామస్తులు బాబా వారసులను కనిపెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story