- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందీ సాహిత్యంలో వైవిధ్య కవి
సాధారణ వ్యక్తిత్వం మానవీయ సాహిత్యం, సింపుల్ లైఫ్ గ్రేట్ వర్క్, ప్రచారం లేని నిరాడంబరుడు

సాధారణ వ్యక్తిత్వం మానవీయ సాహిత్యం, సింపుల్ లైఫ్ గ్రేట్ వర్క్, ప్రచారం లేని నిరాడంబరుడు, ప్రముఖ హిందీ కవి వినోద్ కుమార్ శుక్లా. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప కవి, నవలాకారుడు, కథా రచయిత కూడా. మాయా రియలిజమ్‌కు దరిదాపుల ఉండే శుక్లా శైలి దేశవ్యాప్తంగా ప్రశంసలు, ఆదరణ పొందడం గొప్ప విశేషం. అది ఆయన కృషికి దక్కిన అరుదైన ఘన విజయం.
1937 జనవరి 1న రాజనందగావ్‌లో జన్మించిన వి. కే. శుక్లా తన 88వ యేట భారతీయ సాహిత్యంలో అతున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్‌ను 2024లో అందుకున్న 59వ సాహిత్యకారుడు. ఆయన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి జ్ఞానపీఠాన్ని అందుకున్న మొదటి కవిగా, హిందీ సాహిత్యంలో ఈ పురస్కారాన్ని అందుకున్న 12వ హిందీ సాహిత్యవేత్తగా చరిత్రలో నిలిచారు. వి.కే. రచనల్లో ఏ ఆర్భాటం, ప్రచారానికి తావులేదు. అవి నిరాడంబరుని కవితల్లో రచనల్లో వాస్తవానికి బింబ ప్రతిబింబాలు, అది సూటిగా సున్నితంగా సాదాసీదాగా సాగే సృజన. అంతర్లీన తాత్వికతలో గొప్ప అనుభవం. ఘన సాంద్ర అనుభూతుల అల్లిక ఒకింత ప్రత్యేకత స్పర్శతో పాఠకులను పలకరించడం ఆయన సృజనలకు గొప్ప వరమే.
1971 నుంచి కవిత్వ రచన
వినోద్ కుమార్ శుక్లా 'లగ్భాగ్ జై హింద్' మొదటి కవితా సంకలనం 1971లో అచ్చయింది. 1981లో ప్రకాశన్ ప్రచురించింది 'వహ ఆద్మీ చలా గయా నయా గరం కోట్ పెహన్ కర్ విచార్ కీ తారా' ఆయన రెండవ కవితా సంపుటి.1979లో ఆయన తొలి నవల నౌకర్ కీ షర్ట్'(పనివాడి కమీజ్)ను ప్రకాశన్ పబ్లిషర్ ప్రచురించారు.'పేడ్ పర్ కమ్రా'( చెట్టు పైన గది ) చిన్న కథల సంకలనం 1988లో వచ్చింది. 1992లో 'సబ్ కుచ్ హోనా బచ్ రహేగా' (ఉన్నదంతా మిగిలే ఉంటుంది) కవిత్వ సంపుటి వచ్చింది.
సినిమాలుగా మారిన నవలలు..
1994లో ఆగ్రాలోని నిరాలా శ్రీ జ్ఞానపీఠ్‌లో గెస్టు సాహిత్యకారుడుగా చేరిన వీకే 1996 దాకా పనిచేశారు. అప్పుడు 'లిఖేతో దేఖింగే'(రాసినచో చూడవచ్చు), 'ఏక్ దీవార్ మే ఏక్ కిర్ కీ రహతీ థీ (ఒక గోడలో ఒక కిటికీ ఉండేది) అనే రెండు నవలలు రాశారు. అందులో 'ఏక్ దీవార్ మే ఏక్ కిర్ కీ రహతీ థీ' నవలను ప్రొ. సత్తి ఖన్నా, డ్యూక్ యూనివర్సిటీ ఆంగ్లంలోకి అనువదించారు. వినోద్ కుమార్ శుక్లా ఆధునిక హిందీ రచయిత. ఆయన రచనలలో నౌకర్ కి కమీజ్ నవల మణి కౌల్ పేరుతో చలనచిత్రంగా రూపొందించబడింది, దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతి థీ (ఎ విండో లివ్ ఇన్ ఎ వాల్), ఇది 1999లో ఉత్తమ హిందీ రచనకు సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఈ నవలను రంగస్థల దర్శకుడు మోహన్ మహర్షి రంగస్థల నాటకంగా రూపొందించాడు. ఆయన రాసిన 'హఠషా సే ఏక్ వ్యక్తి బైట్ గయా'ను 2015లో ఢిల్లీలోని రచయిత అనిల్ కత్యాల్ ఆంగ్లీకరణ చేశాడు. శుక్లా పట్నంలో వీధులెంట తిరిగేవారు. అక్కడ ఆయనకు ప్రజలు, ప్రజా సమస్యలు, బాధలు కనిపించేవి అన్నీ ఆయన రచనలకు దోహదపడే వస్తువులుగా ఉండేవి. వాటిని తన సృజనలో అల్లుకోవడంతో ఆయన జన సామాన్య రచయితగా, మానవీయ కవిగా మనకు కన్పిస్తారు. అదే ఆయన రచనా శైలి. అందరినీ మెప్పించే మాయా వాస్తవికత.
జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత
2024లో ఆయన విస్తృతమైన హిందీ సాహిత్య సేవకు జ్ఞాన పీఠ్ అవార్డు వచ్చింది. ప్రతిభావంతులందరూ గొప్పవారు కాదు. అలాగే గొప్పవారందరూ ప్రతిభావంతులు కాలేరు. ఇది సాహిత్య లోకానికి అతికినట్లుగా ఉంది. ప్రజలు కేంద్రంగా రాసే రచనలే ఎల్లకాలం నిలుస్తాయి. అందులోనూ మానవీయ కోణంలో రాసేవి గొప్పగా రాణిస్తాయి. కొన్ని తాత్కాలిక ఆనందం కలిగించొచ్చు, అవార్డులూ అందుకోవచ్చు కానీ కాల పరీక్షకు తట్టుకొని ఎంతకాలం నిలుస్తాయన్నదే నేటి శేష ప్రశ్న. ఏదేమైనా వి.కే శుక్లా కలం జాలువారే రచనల్లో విలక్షణ శైలి, గొప్ప అంతర్లీన తాత్వికత, మానవీయ కోణం ఎందరికో స్ఫూర్తి నిస్తుంది. అదొక్కటే ఆయనకు జ్ఞానపీఠాన్ని మించిన అవార్డు, చెక్కుచెదరని ప్రజల రివార్డ్.
డా.టి.రాధా కృష్ణమాచార్యులు
98493 05871






