ఈ పుస్తకం.. ఒక ఖైదీ బాధామయ గాథ!

by Ravi |   (  Updated:2025-12-15 01:13:37  IST  )

రెండు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 14న 'దిశ' దినపత్రికలో 'హిందీ దినోత్సవం' పురస్కరించుకుని నేను రాసిన వ్యాసం గురించి ఫోన్ చేసి మొదటి సారి నాతో మాట్లాడుతూ 'తెలంగాణ సమాచార్' పత్రికా సంపాదకుడిగా పరిచయం చేసుకున్న రాజన్న తన 'ఫాంసీ' హిందీ పుస్తకం గురించి చెప్పినారు.

ఈ పుస్తకం.. ఒక ఖైదీ బాధామయ గాథ!
X

రెండు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 14న 'దిశ' దినపత్రికలో 'హిందీ దినోత్సవం' పురస్కరించుకుని నేను రాసిన వ్యాసం గురించి ఫోన్ చేసి మొదటి సారి నాతో మాట్లాడుతూ 'తెలంగాణ సమాచార్' పత్రికా సంపాదకుడిగా పరిచయం చేసుకున్న రాజన్న తన 'ఫాంసీ' హిందీ పుస్తకం గురించి చెప్పినారు. ఒక రోజు ఆయన జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుతుంటే ఒక్కసారి నేను షాక్ అయాను. నా కళ్లలో అనుకోకుండానే ఎన్నో సార్లు కన్నీళ్లు వచ్చాయి.

1958లో ఆదిలాబాద్ జిల్లాలోని ఆనంద్‌పూర్‌ గ్రామంలో జన్మించాడు రాజన్న. ఈయన తండ్రి మద్యం మత్తులో తల్లిని ఎప్పుడు కొడుతుండేవాడు. ఒక రోజు తాగి వచ్చి ఇద్దరిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు. భారీ వర్షంలో తడుస్తూ.. ఒక్కపైసా లేకుండా మహారాష్ట్రలోని అమ్మమ్మ గ్రామానికి చేరుకోడానికి తల్లి, కొడుకు పడ్డ బాధలు మాటల్లో చెప్పలేము. 12 ఏట తల్లి మరణం తర్వాత అనాథగా మారిన రాజన్నకు పెద్దమ్మ పెద్ద గంగుబాయి ఆదిలాబాద్ జిల్లాలోని కరంజీ గ్రామానికి తీసుకుపోతుంది. అక్కడ పెద్దమ్మతో కలిసి ఊరిలో బట్టలుతుకుతూ, కూలీ పనులు చేసుకుంటు పెద్దమ్మకూ ఆసరగా నిలుస్తాడు. ఇక్కడ దొరల దోపిడీ, దౌర్జన్యాలు చూసి రాజన్న మనసు రగులుతుంది. పెద్దమ్మను దీని గురించి అడుగుతాడు. ఇక్కడి ఇది మాములే బిడ్డా అంటుంది పెద్దమ్మా. మౌనంగా ఉంటాడు.

కోడి కత్తి దెబ్బకు దొర చస్తే...

1980లో పెళ్లి చేసుకుని కరింజీ పక్కనే ఉన్న కాప్రి గ్రామానికి మారుతాడు. అక్కడ కూడా దొరల దోపిడీ, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు సర్వసాధారణం. వారి ఇంటి ముందు చెప్పులు వేసుకుని నడవడం కూడా నేరమే. ఇవి రాజన్న రక్తాన్ని మరింత రగిలిస్తాయి. ఒక రోజు తన భార్యతో దొర అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆమె ప్రతిఘటిస్తుంది. జరిగిన విషయం భర్తకు చెప్పుతుంది. ఈ విషయమై రాజన్న దొరను ప్రశ్నిస్తే.. అలాంటిది ఏమి లేదు అంటూనే దొర దాడి చేస్తాడు. ఆత్మరక్షణ కోసం ముందుగానే కోళ్లను కోసే కత్తి వెంట పెట్టుకున్న రాజన్న కత్తి తగిలి దొర నేలకొరుగుతాడు. మొదట ఆ ఊరు ప్రజలు కూడా రాజన్నను దొర చంపాడు అనుకుంటారు. రాజన్న ఆదిలాబాద్ పోలీస్‌ స్టేషన్‌‌లో లొంగిపోతాడు. జరిగిన విషయాన్ని చెప్పుతాడు. ఇది రాజన్న నీతికి, నిజాయితీకి నిదర్శనం.

ఉరిశిక్ష నుంచి యావజ్జీవం వైపు..

‘నువ్వు ఒక దుర్మార్గున్ని చంపావు, మంచిపని చేశావు’ అని మెచ్చుకున్న పోలీసులు, చార్జ్‌షీట్‌లో మాత్రం అబద్ధపు సాక్ష్యాలు కోర్టులో ప్రవేశ పెడతారు. దీంతో రాజన్నకు పోలీసులపై, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం పోతుంది. జడ్జి పైకి చెప్పు విసరుతాడు. ‘నేను ఈ కోర్టును బహిష్కరిస్తున్నాను’ అని అరుస్తాడు. జడ్జి ఉరిశిక్ష ఖరారు చెస్తాడు. ముషీరాబాద్ జైలుకు వస్తాడు. డిప్యూటీ జైలర్ మోజేస్ ప్రోత్సాహంతో అప్పీలు చెస్తాడు. జైలులో ఉండగానే ఈయనకు గుండె పగిలే ఉత్తరం వస్తుంది. అది అతని భార్య తండ్రి రాసిన ఉత్తరం. రాజన్నకి ఎవరి కోసమైతే, ఎవరి వల్లైతే ఉరిశిక్ష పడ్డదో ఆమె ఇక నీవు చనిపోయిన తర్వాత నేను వేరే వారిని పెళ్లి చేసుకోవడం కష్టమైతుంది. కాబట్టి నీకు ఉరి తీసే లోపే నేను వేరే పెళ్లి చేసుకుంటాననడం, రాజన్న కూడా పెళ్లి చేసుకోమంటూ జవాబు రాస్తాడు. ఈలోగా హైకోర్టు రాజన్న ఉరి శిక్షను రద్దు చేస్తూ యావజ్జీవ శిక్షగా మారుస్తుంది. ముషీరాబాద్ జైలులో నుంచి రాజన్నను చంచల్‌గూడ జైలులో అండా సెల్‌‌లో వెస్తారు. అక్కడ పడ్డ బాధలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తాయి.

జైలులో అధ్యయనశీలిగా మారి...

జైల్లో గతాన్ని తలుసుకుంటునే రాజన్న పుస్తకాలు చదవడం, రాయడం నేర్చుకుండాడు. డా. బి. ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, హిందీ విద్వాన్, సంస్కృత కోవిద్, జర్నలిజం డిప్లొమా పొందుతాడు. అలాగే నక్సలైట్ బ్యారక్‌లో సామాజిక, రాజకీయ చైతన్యం పొంది ఒక రచయితగా మారుతాడు. 1990లో నాటి ముఖ్యమంత్రి రాజన్నకు క్షమాభిక్ష ప్రసాదించారు. విడుదలైన తరువాత మొదట రాజన్న నక్సల్స్‌లో చేరాలి అనుకుంటాడు. కానీ సాధ్యం కాలేదు. హైదరాబాద్‌లో హిందీ వారపత్రిక ‘దక్షిణ సమాచార్’లో చేరుతాడు. నక్సలైట్ ఉద్యమం, కార్మిక – రైతు పోరాటాలు, దళితుల అణచివేతల గురించి రాసి ప్రచురించడం ద్వారా ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. ఇదే క్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్.వి.చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో తాత్కాలిక ఉద్యోగిగా చేరుతాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హిందీ ఎం.ఏ చేస్తాడు. తాత్కాలిక ఉద్యోగిగానే పదవీ విరమణ పొందినాడు. ప్రస్తుతం 'తెలంగాణా సమాచార్' ఆన్‌లైన్ పత్రికను తెలుగు, హిందీ భాషల్లో నడుపుతున్నారు.

బలహీన వర్గాలపై దాడులకు ప్రతిబింబం..

‘ఉరికంబం నీడలో’ వచ్చిన ఈ ఆత్మకథ కేవలం వ్యక్తిగత కథ కాదు. దేశంలో బడుగు బలహీన వర్గాలపై ఎలా దాడులు జరుగుతున్నయో బహిర్గతం చేసే ఒక మంచి డాక్యుమెంట్. తీర్పు ఇచ్చే న్యాయ స్థానాల్లో అబద్ధం ఎలా ‘సత్యం’గా మారుతుందో, పోలీసులు ఎలా కేసులు మలుపు తిప్పుతారో, సాక్షులు ఎలా పావులుగా మారతారో ఈ ఆత్మకథలో స్పష్టంగా కనిపిస్తుంది. విధి ఉరికంబం నీడలో నిలబెట్టినా తన అంతరంగ సత్యాన్ని పట్టుకొని చివరకు ఆ నీడను దాటి వెలుగునందుకున్న ఒక బహుజనుని ఈ ఆత్మకథ తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రభంజనం.

వాక్య నిర్మాణం సునిశితంగా, క్లిష్ట పదజాలం లేకుండా సాధారణ పాఠకుడి నుంచి పరిశోధకుడి వరకు ఈ ఆత్మకథ సులభంగా, సినిమాలా కళ్లముందు తిరుగుతున్న అనుభూతినిచ్చేలా అనువాదం చేసిన శంకర్‌కి అభినందనలు. ఇంతటి మహోన్నత బహుజనుడి చరిత్రను ప్రచురించిన ఎమెస్కో వారికి అభినందనలు.

పుస్తకం : ఉరికంబం నీడలో

(ఒక బహుజనుడి ఆత్మకథ)

మూలం : కె.రాజన్న

94929 25120

అనువాదం : డా. కారం శంకర్

పేజీలు: 160.

వెల: రూ.150/-

ప్రచురణ : ఎమెస్కో బుక్స్


పరిచయకర్త

-కమలేకర్ నాగేశ్వర్‌రావు

98484 93223

Next Story