జీవన వాస్తవాల కవిత్వీకరణ

by Ravi |   (  Updated:2025-09-14 23:30:34  IST  )

Thriveni-Kavitvam Book Review

జీవన వాస్తవాల కవిత్వీకరణ
X

ప్రముఖ కవి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ ఇటీవల రచించిన ‘త్రివేణి’ మూడు పంక్తుల కవిత్వ సంకలనం మనస్సు తీరా చదివాను. అమితంగా స్పందించాను.

స్వీయ అనుభవాలు ఉద్వేగపరుస్తూ..

వారాల ఆనంద్ తన ప్రతి కవితలో మన మనసుల్ని ఆలోచింపచేసే అనుభూతులు, జీవితంలో ఎక్కడో ఎప్పుడో తారసపడ్డ సంభవించిన అనుభవాలు జ్ఞాపకాలు మన ముందు పరిచారు. మనకు అనేకం గుర్తొస్తాయి. మనల్ని ప్రభావితం చేస్తాయి కూడా. కవి హృదయాన్ని కొంచెం దగ్గరగా పరిశీలించి చూస్తే కొన్ని కవితల్లో ఆవేదన,ఆర్ద్రతలతో కూడిన ఆయన స్వీయ అనుభవాలు మనల్నో ఉద్వేగపరుస్తాయి. యాధృచ్చికంగా కళ్లు చెమర్చుతాయి కూడా. ఇంతటి విలక్షణమయిన, ఉద్వేగభరితమైన భావజాలంలో చదువరిగా తడిసి ముద్దయిపోయాను. నాకు నేను ఇంకాస్త కవికి దగ్గరయ్యాననిపించింది. ఇందులో నాకు నచ్చిన కొన్ని కవితల్ని పలకరించి చూస్తే..

నిగూఢమైన పరోపక్వ భావాలతో..

‘కాలం తోసుకెల్తుంది/ తీరం ఆహ్వానిస్తుంది / అలలు సుఖ దుఃఖాల్లా పరామర్శిస్తాయి’/ ఇందులో సుదీర్ఘ జీవితపు అంతర్లీన అనుభవాలు గోచరిస్తాయి.

‘సూర్యోదయం సూర్యాస్తమయం / చివరాఖరికి నేనూ చంద్రుడూ / వెన్నెల్లో కలుసుకున్నాం’/ఎంతటి రసరమ్యానుభూతి/ అద్భుతమయిన కల్పన.

‘వారసత్వంలో జీవితం ఎంత గొప్పదయినా/ చెమట బిందువులతో నిర్మించుకున్న / బ్రతుకే సార్థకం’ / ఇది జీవిత సత్యం వాస్తవం కూడా

‘విజయంలోని గర్వం కంటే/ ఓటమిలోని దుఃఖమే / మనిషికి మేలు చేస్తుంది’ / గెలుపోటముల సారాంశంగా కవి పలికిన భావమిది. మరో త్రివేణిలో ఆనంద్ ఇట్లా అంటాడు… ‘మనిషి నిరంతర అవిశ్రాంత ప్రయాణికుడు లోనికీ బయటకీ ఇందులో జీవిత సత్యం నిగూఢమైన పరోపక్వ భావాలు వెల్లడవుతున్నాయి.

ఆధునిక భాష, భావంతో..

ఇక ప్రతీకల విషయంలో త్రివేణి లు ఇమజిల పరమపరను పలికిస్తాయి...

‘మనసులో ఎందరో చొరబడ్డారు/ మరెందరో వెళ్ళిపోయారు/ పుస్తకాల షెల్ఫ్‌లో ఖాళీలు’/ ఎంతటి వాస్తవాన్ని పలికించారు.‘ఇక తెరపై విరామం పడి చాలా సేపయింది/ శుభం కార్డు ఏ క్షణమయినా పడొచ్చు’/ కాలం ఎప్పుడయినా ఏమయినా చేయొచ్చని/ కవి ఎంత వాస్తవికంగా కవిత్వీకరించారో కదా. ‘రాత్రంతా చంద్రుడితో గుఫ్తగూ/ నడుమ నడుమ మబ్బులతో షార్ట్ బ్రేక్/ తూర్పున భానుడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం క్యూలో నిలబడ్డాడు’ ఎపిసోడ్ అంటూ ఆధునిక భాష, భావం వాడాడు కవి. ఇంకా ఎంతో వినూత్నమయిన వైవిధ్యమయిన కల్పనలు ఆలోచనలు వ్యక్తం చేసారు త్రివేణిలో ఆనంద్.

అనుభవించిన వారే రాయగలరు..

‘నాకు రెండు హృదయాలు కావాలి/ ఒకటి ప్రేమను పంచడానికి/ మరోటి దుఃఖాన్ని దాచడానికి’

ఒకరకంగా ఈ త్రివేణి మూడు పంక్తుల కవితలు అక్షరానికి అభిషేకమే.

ఇక చివరగా ఒక రకంగా ముక్తాయింపుగా/ “ తెలుసుకోవడానికే వచ్చాం/ తెలిసో తెలియకో వెళ్ళిపోతాం/ తెలియజెప్పడానికి వచ్చామంటేనే కష్టం“ ‘అనామకుడిగానే వస్తాం/ అనామకుదిగానే వెళ్తాం/ రాక పోకల మధ్యే అసలు రహస్యం’ మనిషి జీవిత సత్యమిది. “అసలు విషయం/ పుట్టుక తర్వాత మనకు తెలిస్తే/ మరణం తర్వాత లోకానికి తెలుస్తుంది’ ఇది కదా అసలు మనిషి జీవిత వాస్తవం. ఒకరకంగా జీర్ణించుకోలేని ఈ వాస్తవాలన్నింటినీ అపార జీవన సారం తెలిసి అనుభవించిన వారే రాయగలరనీ త్రివేణి నిరూపిస్తుంది. నా ప్రగాఢ విశ్వాసం, నమ్మకం, అభిప్రాయం కూడా. మానవ జీవన సారాన్ని మూడేసి పంక్తుల్లో భావ యుక్తంగా రాసిన కవి ఆనంద్‌ని అభినందిస్తున్నాను. అందరూ చదవాల్సిన కవితలని నేను భావిస్తున్నాను.

పుస్తకం: త్రివేణి (మూడు పంక్తుల కవిత్వం)

రచయిత: వారాల ఆనంద్

పేజీలు: 134

వెల: 150

ప్రచురణ: పోయెట్రీ ఫోరం, కరీంనగర్

ప్రతులకు: 94405 01281


సమీక్షకులు

-డాక్టర్ వి.చంద్రశేఖర్

98853 69200

Next Story