తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

by Muthe.Rajitha |   (  Updated:2025-06-01 16:42:39  IST  )

“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్న గురజాడ వారి మాటలు సార్వకాలిక సత్యమే ఎందుకంటే దేశాన్ని నిర్మించేది అక్కడి మనుషులేగా.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
X

“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్న గురజాడ వారి మాటలు సార్వకాలిక సత్యమే ఎందుకంటే దేశాన్ని నిర్మించేది అక్కడి మనుషులేగా.

వారి ఆశలు,కష్టాలు, పోరాటాలు,త్యాగాలే ఒక జాతిని గర్వించే స్థితికి తీసుకెళ్తాయి.ఈ మాటలు నిజమవుతాయని నిరూపించిన రాష్ట్రమైన తెలంగాణ.

చరిత్ర త్యాగాలకు ప్రతిరూపం. ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి యోధుడు తన శక్తి,తన ప్రాణం,తన భవిష్యత్తుని అర్పించిన తిరుగుబాటు గాధ ఇది.

ఈభూమిలో ఉద్యమాల ఉధృత,

శతాబ్దాల సాంస్కృతిక శ్రేష్టత,

ప్రజా చైతన్య సాహిత్య విశిష్టత

అన్నీ పెనవేసుకున్నాయి.

"ఇది కేవలం ఒక ప్రాంత గాథ కాదు – ఇది అన్యాయాన్ని ఎదురించిన అనేక మంది పోరాట వీరుల ప్రతిధ్వని."

భీమిరెడ్డి,ఆరుట్ల రామచంద్రా రెడ్డి,రావి నారాయణ రెడ్డి,కొండా లక్ష్మణ బాపూజీ,కొమరం భీమ్,స్వామి రామానంద తీర్ధ,దేవులపల్లి వెంకటేశ్వర రావు, జైని మల్లయ్య గుప్త,షోయబుల్లా ఖాన్,మొయినుద్దీన్ లాటి ఎందరో వీరులతో పాటు కమలమ్మ,ఐలమ్మ, మల్లుస్వరాజ్యాల కదనాల మగువల తెగువల చరిత్ర కొద్దో గొప్పో మనకు తెలుసు,కానీ తెలుసుకోవాల్సింది వారి త్యాగాల ఆంతర్యపు లోతు.

ఈ మట్టి సాహిత్య వాసన చాటిన మారన్న,తెనుగన్న, సోమనార్యులు,చందాల కేశవ దాసు,వట్టికోట ఆళవార్ స్వామి,సుద్దాల హనుమంతు,

సురవరం ప్రతాప రెడ్డి, బండి యాదగిరి లాటి వారి పదాల, గళాలపై నిలిచింది తెలంగాణ సాహిత్య పునాది.

కాళోజి,దాశరధి రాసిన పద్యాల ధ్వని ఈ గడ్డమీదే కాక ఎల్లలు దాటి వినిపిస్తోంది

గోరటి వెంకన్న లాటి ప్రజా కవులు " ఎన్ని ఘనతలు ఇచ్చట, ఇది ఎన్నడొడవని ముచ్చట" అని వర్ణించిన తెలంగాణ వైభవం నిత్యం అవగతమయ్యే అక్షర సత్యం.

వీరందరి పోరాటం,సాహిత్యం ఈ భూమిని కేవలం భౌగోళికంగానే కాకుండా,భావోద్వేగంగా కూడా సమున్నతంగా నిలపడం చారిత్రక సత్యం.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంటే కేవలం పరిపాలనా విభజనే కాదు, ప్రజల సాంస్కృతిక పునర్జన్మ. నీటికి,నియామకాలకి,నిధులకే కాదు మన ఆత్మ గౌరవం కోసం జరిగిన పోరాటం.

ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం మళ్లీ మరిచిపోకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం

ఈ గడ్డ మీద పడిన ప్రతి చుక్క రక్తం,

చేసిన ప్రాణ త్యాగం,

రాసిన ప్రతి అక్షరం,

ఎలుగెత్తిన ప్రతి నినాదం

ఈ రాష్ట్రం కోసం అంకితమైనదే.

ఈభూమి ఘనమైన చరిత్రను ఎలుగెత్తి చాటుదాం._

జై తెలంగాణ!

|| నరసింహ ప్రసాద్ గొర్రెపాటి ||

మాభూమి

సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక.

Next Story