కథా-సంవేదన:క్షమించండి

by Disha edit |
కథా-సంవేదన:క్షమించండి
X

'సాదత్ హసన్ మంటో'ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను 20వ శతాబ్దపు గొప్ప కథా రచయితలలో ఒకరు. ఈ విషయం చాలా మంది అంటూ ఉంటారు. అందులో అనుమానం లేదు.అతని చిన్న కథలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు 'బొంబాయి కథలు, దేశ విభజన కథలు' మంటో అరుదైన శైలి 1947-48 నాటి విభజన అల్లర్ల భయానకతను బయటకు తెస్తుంది. అంతే కాదు. పాఠకులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. చెడు వాస్తవాన్ని వర్ణించినప్పుడు, ఆ భయానకత్వం అనేక రెట్లు అవుతుంది. తోబా టేక్ సింగ్, ఖోల్ దో ,తండా గోష్త్ విభజనపై అతని ప్రసిద్ధ చిన్న కథలు.'క్షమించండి' చిన్న కథ. కానీ ఈ కథ మనలను షాక్‌కు గురి చేస్తుంది. మనలను వెంటాడుతుంది. తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇక కథలోకి వెళ్దాం...

'కత్తి బొడ్డును చీల్చింది. అది నాభిని క్రిందికి ముక్కలు చేయడంతో, ట్రౌజర్-బెల్ట్ చిరిగిపోయింది' కత్తితో నరికినవాడు అకస్మాత్తుగా విచారం వ్యక్తం చేశాడు. 'ఛీఛీఛీ పొరపాటు జరిగింది' సందర్భం తెలియక పోతే ఈ పదాలకు అర్థం తెలియదు. 1947 విభజన అల్లర్ల సమయంలో పురుషుడు ముస్లిమా లేక హిందువా? అనేది అతని పురుషాంగం సున్తీ చేయించుకున్నారా లేదా అనే విషయం తో నిర్ధారించబడింది. ఒక వ్యక్తి జీవించాలా వద్దా? అనేది కొన్ని సందర్భాలలో సున్తీ నిర్ణయించేది. ఈ నేపథ్యంలో పై కథనాన్ని చదవండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపుతున్నాడు. అతను తన కత్తిని అవతలి వ్యక్తి బొడ్డు గుండా తిప్పుతాడు. కత్తి నాభి క్రిందకు వెళ్లినప్పుడు, అది ఇతరుల ట్రౌజర్ బెల్ట్‌ను నరికివేస్తుంది. ట్రౌజర్ కిందపడిపోవడంతో, హంతకుడు తాను తప్పు చేశానని తెలుసుకుంటాడు. అవతలి వ్యక్తి హంతకుడి మతానికి చెందినవాడు. హంతకుడు ఒక్కసారిగా పశ్చాత్తాపం చెంది, 'ఛీ ఛీ. నేను తప్పు చేశాను' అంటాడు.

హంతకుడి మతాన్ని ,చంపబడిన వ్యక్తి మతాన్ని మంటో చెప్పలేదు. అది అతనికి అవసరం లేదు. సామాన్య ప్రజలలో వుండే రాక్షసులు, గుంపులో భాగమైన తర్వాత బయటకు వస్తారు. మంటో అది చూపించాలనుకున్నాడు. చూపించాడు. అలాంటి బుద్ధిహీనమైన హింస ఇప్పటికీ కొనసాగుతోంది. కథలో ప్రశ్చాత్తాపం ఉంది. కానీ, ఇప్పుడు అలాంటి పశ్చాత్తాపం ఉందో లేదో తెలియదు. కథలో హంతకుడు తాను తప్పు చేశానని బాధపడతాడు. ప్రాపంచిక హింస భయానక దృశ్యం ఈ కథ. మంటో కథలలోని ముగింపు మనలను చాలా రోజులు వెంటాడుతుంది. ఈ అతి చిన్న కథ కూడా అలాంటిదే!

మంగారి రాజేందర్ జింబో

94404 83001



Next Story

Most Viewed