భారతీయ సాహిత్య శిఖరం ఠాగూర్..

by Ravi |   (  Updated:2026-07-20 01:00:34  IST  )

నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం, గీతాంజలి సాహిత్య విశిష్టత, జనగణమన, అమర్ సోనార్ బంగ్లా రూపకల్పన, శాంతినికేతన్ స్థాపన, జాతీయోద్యమంలో ఆయన పాత్ర, సాహిత్య వారసత్వంపై కథనం..

భారతీయ సాహిత్య శిఖరం ఠాగూర్..
X

ఆయన నోబెల్ అవార్డు గ్రహీత, భారతీయ సాహిత్య శిఖరం, గురుదేవులు, విశ్వకవిగా ఆత్మీయంగా మనం పిలుచుకునే రవీంద్రనాథ్ ఠాగూర్. బెంగాల్‌లో 1861 మే 7వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా జన్మించాడు. రవీంద్రుని రచనలలో గీతాంజలి చాలా గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోకి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక భారతీయ, ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన.

మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశ సారం. 1913వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆ తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో రచించిన గీతాంజలి కవితను తెలుగులోకి గుడిపాటి వెంకట చలం, కొంగర జగ్గయ్య, మరికొందరు అనువదించారు.

జనగణమన, అమర్ సోనార్ బంగ్లా రూపకర్త!

ఠాగూర్ బహుముఖ రచయిత, కానీ ప్రముఖంగా కవిత్వం ఆయన ఊపిరి. టాగూర్ ఆధునిక భారతీయ సాహిత్యం మరి సంగీతానికి కొత్త రూపాన్ని ఇచ్చిన గొప్ప బెంగాలీ కవి, రచయిత, సంగీత స్వరకర్త, తత్వవేత్త. తన ప్రసిద్ధ కవితా సంకలనం 'గీతాంజలి'కి గాను 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఆసియావాసి, ఐరోపేతర వ్యక్తి ఆయనే. అలాగే, భారతదేశం 'జనగణమన', బంగ్లాదేశ్ 'అమర్ సోనార్ బంగ్లా' దేశాల జాతీయ గీతాలకు ఆయనే స్వరకర్త. అలాగే వాటి వెనుక ఉన్న సృజనాత్మక సాహిత్య ఆలోచనాపరుడు.

వలసపాలనలో గుర్తింపు.. గోరా

ఆయన విశ్వ-భారతి విశ్వవిద్యాలయం, ప్రకృతి ఒడిలో సమగ్ర అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు 'శాంతినికేతన్' అనే ప్రయోగాత్మక బహిరంగ విద్యా సంస్థను స్థాపించారు. జలియన్ వాలాబాగ్ దురంతానికి నిరసనగా 1919లో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన 'నైట్‌హుడ్' బిరుదును ఆయన త్యాగం చేసి అధికారికంగా వదులుకున్నారు. రవీంద్రుని ప్రముఖ రచనలలో గీతాంజలి భక్తి, ఆధ్యాత్మిక కవితలతో కూడిన ప్రపంచ ప్రఖ్యాత సంకలనం. గోరా వలస పాలన కాలంలో రాజకీయ గుర్తింపు, కులం, మతం వంటి అంశాలను చర్చించే అత్యంత ప్రభావవంతమైన నవల. ఘరే-బైరే (ఇల్లు- ప్రపంచం) ప్రారంభ దశలో ఉన్న భారతీయ జాతీయవాదంలోని సంక్లిష్టతలను ప్రతిబింబించే నవల. రవీంద్ర సంగీతం ఆయన స్వరపరిచిన 2,000కు పైగా పాటల అపారమైన సంపద, ఇది బెంగాలీ సంస్కృతిలో కీలక భాగంగా నిలిచింది.

వందేమాతరం తొలి ఆలాపన

రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖ పాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు. రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు.

ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో..

అతని కవిత్వం ఉపమానాలు, అనుప్రాసలు, ప్రతీకలతో సమృద్ధిగా నిండి ఉంటుంది. ఇది లోతైన భావాలను, విస్తృతమైన ఇతివృత్తాలను ఆవిష్కరిస్తుంది. ఈ కావ్యంలోని ఈ గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది. 'మంత్రములు జపమాలలు విడిచిపెట్టు తలుపు లన్నింటినీ బంధించి ఈ చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావు కళ్ళు తెరిచి చూడు. నీవు ఆరాధించే దేవుడు నీ ఎదుట లేడు! ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో, ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో, అక్కడ ఆ పరమాత్ముడున్నాడు. వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు. నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి ఆనేల మీదికి పదా...'

శాంతినికేతన్.. గ్రామ పునర్నిర్మాణం

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని భావించిన రవీంద్రుడు అందుకై శాంతినికేతన్ నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు. రవీంద్రుడు మొదట వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించాడు. ఆ తర్వాత అమల్ అనే పిల్లవాణ్ణి గురించి పోస్టాఫీసు అనే నాటకం రాశాడు. చిత్రాంగద నాటకం ఆయనకు మంచి పేరు తెచ్చింది.'ప్రకృతి – ప్రతీక' అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక శ్రేష్టమైన నాటకాలు రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలిసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, 'ప్రకృతి - ప్రతీక' అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలిసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమైన 'గోరా' నవల రవీంద్రునికెంతో పేరు తెచ్చింది.

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో

ఎక్కడ మనసు నిర్భయంగా ఉండి,/ గర్వంగా తలెత్తి నిటారుగా ఉంటుందో/ ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో/ ఎక్కడ ప్రపంచం సంకుచితమైన/ ఇంటి గోడలచే ముక్కలు ముక్కలుగా విడిపోలేదో /ఎక్కడ మాటలు సత్యపు లోతుల నుండి వెలువడతాయో/ ఎక్కడ అలసటలేని కృషి పరిపూర్ణత వైపు/ తన చేతులను చాస్తుందో/ ఎక్కడ నిర్మలమైన వివేక భరిత ప్రవాహం/ నిర్జీవమైన అలవాట్ల నిస్సార ఎడారి / ఇసుకలో తన దారిని కోల్పోలేదో/ ఎక్కడ మనసు నీచేత నిరంతరం విస్తరిస్తున్న/ ఆలోచనలు, కార్యాచరణల వైపు నడిపించబడుతుందో / అక్కడ ఓ నా తండ్రీ / స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశం మేల్కొననీ.

అన్ని కాలాల్లోనూ ఫ్రెష్‌గా..

ఈ కవిత ఠాగూర్ రచన శైలి రూపం, థీమ్‌కు అద్దంపట్టే స్వేచ్ఛ గాలి, మనసు మెదడు మంచి దారిలో నిర్భయంగా నడిచే చోట ఓ దేవా! అలాంటి వాతావరణం గల చోట స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలున్న స్వర్గంలో నా దేశం మేల్కొల్పాలని, అనడంలో సార్వత్రిక దేశ సౌభాగ్యం, భవిష్యద్దర్శనం కవితాశక్తితో చూపడమే. ఇందులో ఠాగూర్ జాతీయవాదంతో పాటు మనిషి మూలాలైన పౌర స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రశాంత జీవన సౌందర్యం నిర్భీతితో గడిపేలా ఉద్బోధ చేస్తూ అన్ని కాలాల్లోనూ ఫ్రెష్‌గా, తాజా పువ్వుల సువాసనలను మోసుకొస్తూ ఠాగూర్ కవితను అజరామరం చేసింది. రవీంద్రుడు 1941 ఆగస్టు 7న తన 80 ఏండ్ల వయసులో కలకత్తా, బ్రిటిష్ ఇండియాలో మరణించారు.

-డా.టి.రాధాకృష్ణమాచార్యులు

98493 05871

Next Story