- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత్వం కమోడిటీ కాదు...
డెబ్భై వసంతాలు జీవించడం సాధారణ మనిషికి అసాధారణమైన విషయమేమీ కాదు. కవిగా మొదలై, నిలదొక్కుకొని, యాభై ఏళ్లుగా

డెబ్భై వసంతాలు జీవించడం సాధారణ మనిషికి అసాధారణమైన విషయమేమీ కాదు. కవిగా మొదలై, నిలదొక్కుకొని, యాభై ఏళ్లుగా సాహిత్యాన్ని శ్వాసిస్తూ రచయితగా మిగిలి ఉండడం కత్తుల వంతెన మీద యుద్ధం చేయడమే. ఏడు పదులుగా తెలంగాణ పాదముద్రల జాడను గుండె గదుల్లో నింపుకుంటూ, ఆరు పదులుగా మనుషుల లోతును అవగాహన చేసుకుంటూ, అయిదు పదులుగా కవిత్వ అక్షరాలకు నెత్తుటి పదునును అద్దుతూ ముందుకు సాగుతున్న అవిరామ ప్రతిపక్ష కవి జూకంటి జగన్నాథం.
ఎప్పటికప్పుడు ‘సల్ఫ్యూరిక్ ఆసిడ్’లో శుద్ధి చేసుకుంటూ తను పుట్టి పెరిగిన తంగళ్ళపల్లి నేల మీద నుంచి జూకంటి ఏ కంటితో చూస్తాడో కాని గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ కదలికలన్నీ ఆయన అక్షరాల్లో అనునాదమై ధ్వనిస్తాయి. బతుకు దెరువు కోసం అప్పులు, రెక్కలు మూటగట్టుకొని ఎడారి దేశాలకు వలసపోయిన రాజాలు అక్కడ పోలీసులకు దొరికిపోయి ఇసుక దేశంలో ఉండలేక, ఇక్కడికి రాలేక నలిగిపోతుంటే జూకంటి కంట్లో తుఫాను చెలరేగుతుంది. గిట్టుబాటు ధర రాక ఒక రైతు పెరుగన్నం లాగా పురుగుల మందును తాగితే ఆయన హృదయంలో మందు పాతర పేలుతుంది. ఒక తమ్ముడు బూటకపు ఎన్ కౌంటర్‌లో తుపాకి గుండుకు బలై నేలకొరిగిపొతే అతని రక్తం ఆటుపోట్లకు గురై మత్తడి దుంకుతుంది.
ప్రశ్నల కొడవళ్లను భుజాన వేసుకొని
నట్టింట్లో వెలసిన రంగుల పెట్టె మాయల పడి ప్రతి ఇల్లూ వస్తువుల అంగడిగా మారిన కార్పొరేట్ కుట్రలకు కవి ప్రాణం తల్లడిల్లిపోతుంది. వందల ప్రశ్నల కొడవళ్లను భుజాన వేసుకొని రాజ్యాన్ని, వ్యవస్థను, దగుల్బాజీ తనాన్ని, నంగనాచి తనాన్ని కడిగిపారేస్తాడు. కాలపు మడతల్లో పడిపోయిన బాల్యాన్ని మళ్లీ తవ్వి తీసిన మనవడిని చూస్తే మనిషి చెట్టుకు చిగురులా వికసిస్తాడు. కవిత్వం, కథ, వ్యాసం ప్రక్రియ ఏదైనా జూకంటి నిలబడేది సగటు మనిషి వైపు. పీడితుని వైపు. అతనికి జీవితం, కవిత్వం వేరు కాదు రెండూ రక్త గతమైన జీవ ధాతువులు. మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో నిబద్ధతతో, బాధ్యతతో కాలాన్ని, దాని ప్రతి మలుపునూ, మోసాన్ని కవిత్వీకరిస్తూ వస్తున్న కవిత్వపు బాటసారి.
కవిత్వం ఒక యానకం..
“సమాజానికి నాకూ మధ్య నా కవిత్వం ఒక యానకం” అని ప్రకటించుకునే జూకంటి కవిత్వం నిండా గడిచిన ఐదు దశాబ్దాలుగా లోకంలోని శిథిలత్వం, బీభత్సం, క్రూరత్వం, పన్నాగం, అన్యాయం, బాధ, దుఃఖం, మనిషిని తొలిచే ప్రతి అంశం. ప్రత్యేకించి ప్రపంచీకరణ చేసే విధ్వంసపు వేయి ముఖాలు, మర్రిచెట్టులా ఊడలు దిగిన పెట్టుబడిదారి దళారి వ్యవస్థ నిప్పుకణికలుగా పరుచుకున్నాయి. గాలి ఆడని క్షణాలు, మనిషి నోటికి తాళం వేసిన గడియలు, మానవ ఉనికి మీద ఇనుప పాదం మోపిన రోజులు కవిని ఊపిరి ఆడకుండా చేసి ఆ ఉక్కపోతను తన కవిత్వంలోకి నేరుగా దిగుమతి చేస్తాడు.
రైతు ముఖంలో దిగులు, కన్నీటి చారికలు..
రైతు ముఖంలోని కనిపించని దిగులును, కన్నీటి చారికలను, తాడు లేకుండానే ఉరి వేసే కుట్రను, సాంచాల నడుమ అటు ఇటు ఉరుకుతూ నరాలనే పోగులుగా అతికే కామ్ గార్లను, మధ్య తరగతి సర్దుబాట్లను రగిలే ఆకలి కడుపుతో మాట్లాడే కవి జూకంటి. “ఎవరితోని చెప్పుకోవాలె ఏమని చెప్పుకోవాలె / ఎవరితోని పంచుకోవాలే ఎట్లని పంచుకోవాలె / లోపల దెబ్బలు నెత్తురెల్లని తన్నులు / మనసు కచ్చపెక్క అయితుంది”
మనసు లోపల రక్తస్రావం..
ఇవాళ భూమి మీద ప్రతి మనిషి మానసిక పరిస్థితి ఇది. అన్ని సౌకర్యాలు ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ అడుగు తీసి అడుగు వేయరాదు. పైకి అంతా మంచిగానే కనిపిస్తుంది కాని మనసంతా ముక్కలు ముక్కలై లోలోపలనే రక్తస్రావం జరుగుతుంది. జూకంటి కవిత్వం సాంతం ఈ ఉక్కపోత, కనిపించని బంధనాలను తెంచుకోవాడానికి పడే పోరాటమే కనిపిస్తుంది.
ప్రజల పక్షం తన దారి..
తన సాహిత్య ప్రయాణంలో జూకంటి ఇప్పటిదాకా పద్దెనిమిది కవితా సంపుటాలు, సమగ్ర కవిత్వం, జూకంటి జగన్నాథం కథలు, ఆయా సందర్భాల్లో కొన్ని మైలు రాళ్ళ లాంటి వ్యాసాలు రాశారు. కొన్ని కవితలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన కవిత్వాన్ని మెచ్చి కొన్ని అవార్డులు కూడా వరించాయి. ఎన్నో సంస్థలను నడిపారు. మొదటి నుంచి జూకంటి దారి స్పష్టం. ఆయన ప్రజల పక్షం. “శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే/ఒక్క అన్నం మెతుకన్నా లేని ఖాళీ కడుపు/అన్ని తుపాకుల్ని వెక్కిరిస్తున్నది/అన్ని కుర్చీల్ని ధిక్కరిస్తున్నది” అంటాడు.
కుటిలత్వం తెలియని మనుషులు, వృద్ధాప్యపు అమ్మలు, పిల్లలు, ఉద్యమ వీరులు జూకంటి కవిత్వంలో తరచుగా కనిపించే కవితా దినుసులు. జూకంటికి ప్రజల భాష పట్ల ఎనలేని గౌరవం. ఆయన కవిత్వమంతా మౌఖిక/సంభాషణ శైలీ, శిల్పాల్లోనే సాగుతుంది. ఒక గ్రామీణ రైతు మాట్లాడుతున్న శైలిని మనం సొంతం చేసుకుంటాం. “ఏది ఏమైనా/కడుపుల ఎంత దుఃఖం ఉన్నా/మనిషికి బుక్కెడు బువ్వ పెట్టే/పొలం నా బలం బలగం/పోలమే నా స్వస్థలం” అంటాడు.
మనిషి కలల శకలాలే కవిత్వం..
జూకంటి కవిత్వానికి కొలమానాలు రెండే. ఒకటి నిత్యం గాయాలతో నడుస్తున్న మనిషి. రెండు రోజురోజుకూ వ్యాపారీకరింపబడుతున్న రాజ్యం. ఈ రెండింటి మధ్య విరిగిన మనిషి కలల శకలాలు ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. దుఃఖం, నెత్తురు కనిపించని కాలువలై పారుతుంది. కవిత్వం తడి పొడి పదాల్లో ఇమిడిపోయి మనల్ని ఒరుసుకుంటూ సజీవంగా పారుతుంది.
(జూకంటి జగన్నాథం సప్తతి సందర్భంగా)
-డా. వెల్దండి శ్రీధర్
98669 77741






