చివరి కన్నీటి చుక్క

by Ravi |   (  Updated:2026-06-08 00:00:20  IST  )

Poem

చివరి కన్నీటి చుక్క
X

ఇంటి కోసం వలస

పక్షి అయ్యి కొడుకు

ఆకాశానికి ఎగిరితే

కాలానికి కళ్ళు ఇచ్చింది

రెక్కలు ముక్కలు కష్టంతో

నాలుగు మెతుకులు కడుపులో

పిల్లల చదువులు గాలి పటాలు

అయినా లెక్కచేయని ప్రేమ అన్నని

దూరంగా పొమ్మన్నాయి

సంవత్సరానికి వొక తూరి

సుక్కలా వచ్చి వెళ్ళిపోతాడు....

కొడుకు వస్తే...అన్ని పండగలు

కళ్ళలో వెలుగులవుతాయి..

ఎప్పటి లానే ఈ సారి వస్తాను అని చెప్పి

ఊరి రైలెక్కి బ్యాగులో ఆశలనీ,

కన్న తల్లి ఆనందాన్ని ఊహిస్తూ

కాలు పెట్ట వీలు లేని జనరల్ బోగీలో

కాళ్ళు చేతులు

ముడుచుకొని పడుకున్నాడు

తెల్లవారే లోగా కొడుకు బతుకు

తెల్లారింది ప్రమాదం

మృత్యువుగా మారింది

పట్టాల మీద వాడి భవిష్యత్తు

బ్యాగులో రక్తసిక్తమై పడి ఉంది

గాలిగా వచ్చి గుట్టలుగా పడి ఉన్న

దేహాలలో తన కంటి

నలుసును వెతుకుతుంది

కన్నీటితో చివరి నివాళి

కొడుకు శవానికి

ఆమె వొక చివరి కన్నీటి బొట్టు

-పుష్యమీ సాగర్

79970 72896

Next Story