సైబర్ నేరాల్లో ట్రేడింగ్ ఫ్రాడ్‌లదే అగ్రస్థానం.. ఏకంగా రూ.139 కోట్లకు కుచ్చుటోపీ

by Kema Shiva Kumar |

అత్యాశే పెట్టుబడిగా తెలంగాణలో సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు.

సైబర్ నేరాల్లో ట్రేడింగ్ ఫ్రాడ్‌లదే అగ్రస్థానం.. ఏకంగా రూ.139 కోట్లకు కుచ్చుటోపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అరచేతిలోని స్మార్ట్‌ఫోనే ఆయుధంగా.. ప్రజల అత్యాశ, భయమే పెట్టుబడిగా సైబర్ కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న అత్యాశ అమాయకులను నిలువునా ముంచుతోంది. 2026 సంవత్సరం తొలి 5 నెలల (జనవరి-మే) వ్యవధిలో నమోదైన సైబర్ నేరాలను విశ్లేషిస్తే.. ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ స్కామ్‌లదే అగ్రస్థానం కావడం గమనార్హం. ఒకవైపు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. భారీ లాభాలంటూ ఊరించే ప్రకటనలకు ఆకర్షితులై ప్రజలు తమ జీవితకాల సంపాదనను సైబర్ నేరగాళ్ల చేతిలో పెడుతున్నారు. పెట్టుబడి మోసాలు, పోలీసులు, ఈడీ, సీబీఐ అధికారులమంటూ భయపెట్టి డబ్బులు గుంజే డిజిటల్ అరెస్ట్‌లు, ఫేక్ జాబ్ ఆఫర్లు, మ్యాట్రిమోనియల్ స్కామ్‌లు, యూపీఐ మోసాలు ఇలా.. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 27,230 సైబర్ కేసులు నమోదయ్యాయి. 2025-26 నాటికి కేసుల సంఖ్య కాస్త తగ్గినా మోసాల తీవ్రత, పోగొట్టుకుంటున్న సొమ్ము మాత్రం పెరుగుతుండటం విస్మయపరుస్తోంది. అయితే, ఈ నేరాలను కట్టడి చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ సిటీ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట దేశవ్యాప్తంగా జల్లెడ పడుతూ వందలాది మంది కేటుగాళ్లను అరెస్ట్ చేస్తున్నారు.

కోట్లలో లావాదేవీలు..

కేవలం ఫిబ్రవరి నెలలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 78 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసులను ఛేదించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట భారీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దేశవ్యాప్తంగా ఏకంగా 16 రాష్ట్రాల్లో జల్లెడ పట్టి 74 సైబర్ కేసులకు సంబంధించి 117 మంది అంతర్రాష్ట్ర నేరగాళ్లను అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. దర్యాప్తులో విస్మయపరిచే నిజాలు వెలుగుచూశాయి. ఇప్పుడు అరెస్టయిన ఈ 117 మందిపై దేశవ్యాప్తంగా ఏకంగా 1,081 సైబర్ కేసులు ఉన్నట్లు తేలింది. వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే సుమారు రూ.139 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

ట్రేడింగ్ మోసాలు..

పోలీసులు ఛేదించిన కేసుల్లో అత్యధిక వాటా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లదే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఛేదించిన 74 కేసుల్లో ఏకంగా 63 కేసులు కేవలం ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లకు సంబంధించినవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీని తర్వాతి స్థానాల్లో పోలీసులు, ఈడీ, సీబీఐ అధికారులమంటూ భయపెట్టి డబ్బులు గుంజే డిజిటల్ అరెస్ట్ లు 6 కేసులు, ఓటీపీ ఫ్రాడ్స్ 4, సోషల్ మీడియా ఫ్రాడ్ 1 ఉన్నాయి. అరెస్టయిన ఈ నేరగాళ్ల వద్ద నుంచి పోలీసులు రూ.36 లక్షల నగదుతో పాటు 221 మొబైల్ ఫోన్లు, 26 ల్యాప్‌టాప్‌లు, 141 సిమ్‌కార్డులు, 115 చెక్‌బుక్కులు, 54 డెబిట్ కార్డులు, 56 షెల్ కంపెనీల స్టాంపులు, 152 పాస్‌బుక్కులను సీజ్ చేశారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరిలో రూ.34.76 లక్షలను బాధితులకు తిరిగి రీఫండ్ చేయించారు. మరోవైపు సైబర్ సెల్స్‌కు 2,963 సైబర్ ఫిర్యాదులు రాగా, 461 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఆపరేషన్లు చేపట్టి 11 మంది నిందితులను అరెస్టు చేశారు. బాధితులకు మరో రూ.24.10 లక్షలు మొత్తం కలిపి సుమారు రూ. 59 లక్షలు తిరిగి ఇప్పించారు. పోలీసులు నిరంతర ఆన్‌లైన్ నిఘా ద్వారా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న 539 ప్రకటనలను,124 ఫేక్ ప్రొఫైల్స్‌ను గుర్తించి వాటిని శాశ్వతంగా తొలగించారు.

ఇలా ఫిర్యాదు చేయండి

సాంకేతికతను ఎంత పకడ్బందీగా ఉపయోగిస్తున్నా, అవగాహనా కార్యక్రమాలు ఎన్ని చేపడుతున్నా.. సైబర్ నేరాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడాలంటే ప్రజల స్వీయ జాగ్రత్తే కీలకం. ఫేక్ మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్, ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపులు, డిజిటల్ అరెస్ట్, ఏపీకే ఫైల్స్ పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. గ్యారెంటీ రిటర్న్స్, అధిక లాభాలు అని చెప్పే ఆఫర్లను గుడ్డిగా నమ్మొద్దు, ఓటీపీలు, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పకూడదు. రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చట్టవిరుద్ధం, అందులో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవు. సైబర్ మోసం జరిగిందని అనుమానం వచ్చిన వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి. మోసం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చేసి, తిరిగి రికవరీ చేసే అవకాశం ఉంది.

Next Story