- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ధరల మోత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూముల మార్కెట్ విలువ 15% నుంచి 25% వరకు పెరిగింది. ప్లాట్ల ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది.

దిశ ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరల మార్కెట్ విలువ పెంపు విషయంలో తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 15% నుంచి... మరికొన్ని ప్రాంతాల్లో 25% దాకా విలువ పెరిగింది. ఈ ప్రభావం కొత్తగా కొనుగోలు చేసే వారిపై ఎక్కువగా పడుతుంది. ఇండ్ల నిర్మాణాల కోసం ప్లాట్లు కొనుగోలు చేసే వారికి ఎక్కువగా ఇబ్బందిగా మారుతుండగా... వ్యవసాయ భూముల ధరల రెట్టింపుతో రైతులకు లాభం జరుగుతున్నట్లు చెబుతున్నారు.
ప్లాట్ల ధరలపైనే ఆర్థిక భారం..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్ ప్రాంతంలో గతంలో గజం 2100 ఉండగా తాజాగా 2700 పెరిగింది. ఇదే పట్టణంలోని శాంతినగర్ మంజులాపూర్ సిద్దాపూర్ ప్రాంతంలో గజం 2100 ఉండగా... తాజా పెంపుదలతో 2500 మారింది. ఏఎన్ రెడ్డి కాలనీ, ఆదర్శ నగర్ భాగ్యనగర్ ప్రాంతాల్లో గజం 4400 ఉండగా... ఇప్పుడు 20 శాతం పెరిగి 5500 అయ్యింది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే పాత జాతీయ రహదారి వెంబడి గజం 12,500 ఉండగా... ఇప్పుడు 17,500 అయ్యింది. ఇక వ్యవసాయ భూములకు సంబంధించి గతంలో ఉన్న ధరలకు 50 శాతం పెంచారు. ఇది పెద్దగా మారినట్లు లేదు. ఎకరాల లెక్కన 50 శాతం పెంచడంతో రైతులకు ఒక రకంగా మేలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. కొత్తగా కొనుగోలు చేసే వారికి ప్లాట్లపైనే ఎక్కువగా భారం పడుతుంది.
వ్యవసాయ భూములు కొనుగోలు చేసేవారు పెద్ద మొత్తంలో కొన్నప్పటికీ వారికి పెద్దగా ఆర్థిక భారం పడటం లేదు. మంచిర్యాల జిల్లాలో మార్కెట్ వాల్యూ పెంపుదల విపరీతమైన ప్రభావం చూపుతున్నది. ఉమ్మడి జిల్లాలోనే అత్యంత ఎక్కువగా ధరలు ఉన్న మంచిర్యాల ప్రాంతంలో పెరిగిన భూముల విలువ కారణంగా కొనుగోలు దారులపై విపరీతమైన ప్రభావం పడుతుంది. పురపాలక సంఘాలుగా ఉన్న నిర్మల్, ఆదిలాబాద్, బైంసా, ఆసిఫాబాద్, కాగజ్నగర్, బెల్లంపల్లి క్యాతన్ పల్లి, మందమర్రి, మంచిర్యాల, లక్సెట్టిపేట, చెన్నూరు ఖానాపూర్ ప్రాంతాల్లో భూముల ధరల పెరుగుదల కారణంగా కొనుగోలు దారులపై విపరీతమైన ప్రభావం పడుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ స్లాబ్..
అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరల పెంపుదల సింగిల్ స్లాబ్ గా ఉంది. వ్యవసాయ భూముల ధర రెట్టింపు కాగా... నివాస స్థలాల విషయంలో ప్రస్తుతం గజం ధర 500 ఉండగా... తాజాగా 700 కు పెంచారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పెద్దగా భారం పడటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.






