- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు సేఫ్
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ,సత్తుపల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీ ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉండగా, వారు సురక్షితంగా బయటపడడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది.
వేంసూరు మండలం కందుకూరు చెందిన కె.వి.ఆర్ ట్రావెల్స్ బస్సు ఏపీలోని ఏలూరు జిల్లా ధర్మాజీ గూడెం నుంచి హైదరాబాద్ బయల్దేరిన కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, మార్గమధ్యంలో ప్రయాణికులను ఎక్కించుకుని సత్తుపల్లి మీదుగా హైదరాబాదు వెళ్తుండగా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో జాతీయ రహదారిపై ఉన్న రైల్వే బ్రిడ్జిని బస్సు బలంగా ఢీకొట్టడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, ముందు చక్రాలు కూడా ఊడిపోయాయి. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వి.ఎం. బంజర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహయంతో బస్సులోఉన్న ప్రయాణికులను బయటికి తీసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల ద్వారా సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉండగా, వారు సురక్షితంగా బయటపడటం ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంతో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ బస్సు నడపడం వల్లే బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. బస్సు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో బ్రిడ్జి కింద భాగం సింగరేణి గూడ్స్ రైలు వెళ్లే మార్గం కావడంతో ప్రమాదవశాత్తు ఈ బస్సు బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్ పై పడి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కేవలం బస్ డ్రైవర్ నిర్లక్ష్యం, బ్రిడ్జి నిర్మాణ సమయంలో బ్రిడ్జి దగ్గర రోడ్డు కుంగిపోవటం ఈ ప్రాంతంలో ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదానికి కారణంగా ప్రజలు భావిస్తున్నారు.






