త్రివిక్రమ్ చెయ్యి పడితే చాలు.. చిన్న సహాయంతో మూవీ పెద్ద హిట్

by Pulgam srinivas |

‘సంతోషం’ సినిమా క్లైమాక్స్‌కు సరైన ఎమోషన్ కుదరకపోవడంతో, త్రివిక్రమ్ కేవలం 10 నిమిషాల్లో అద్భుతమైన క్లైమాక్స్ చెప్పేశారట.

త్రివిక్రమ్ చెయ్యి పడితే చాలు.. చిన్న సహాయంతో మూవీ పెద్ద హిట్
X

దిశ, వెబ్ డెస్క్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్న ఆయన, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. ముఖ్యంగా దర్శకుడు విజయ్ భాస్కర్ సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. చాలామంది నాగార్జునతో త్రివిక్రమ్ కేవలం ‘మన్మధుడు’ సినిమాకే పనిచేశారని అనుకుంటారు.

కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ‘సంతోషం’ సినిమాకు కూడా త్రివిక్రమ్ కీలక సహాయం చేశారట. ఇండస్ట్రీలో పలువురు అభిప్రాయం ప్రకారం, ఆయన సహకారం వల్లే సినిమా మరింత బలపడిందని చెబుతుంటారు. అసలు ‘సంతోషం’ సినిమా విషయంలో ఏమి జరిగిందంటే.. దర్శకుడు దశరథ్, నాగార్జునకు ఒక కథ చెప్పాలని అనుకున్నారు. అందులో భాగంగా ‘సంతోషం’ కథను వినిపించగా, నాగార్జునకు అది బాగా నచ్చిందట. అయితే దశరథ్ మాత్రం ఆ సినిమాకు తానే దర్శకత్వం వహించాలని మొదట అనుకోలేదట.

కానీ కథ విన్న నాగార్జున, “నువ్వే ఈ సినిమాకు దర్శకత్వం వహించాలి” అని చెప్పడంతో దశరథ్ ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత క్లైమాక్స్ భాగం రాస్తున్న సమయంలో దశరథ్‌కు సరైన ఎమోషన్ కుదరడం లేదట. పేజీలకొద్దీ డైలాగులు రాసినా, అనుకున్న ఫీల్ రావడం లేదని భావించారట. దీంతో తన స్నేహితుడు త్రివిక్రమ్‌కు ఈ విషయం చెప్పగా, ఆయన కేవలం 10 నిమిషాల్లో క్లైమాక్స్‌ను చెప్పేశారట. అది అద్భుతంగా నచ్చడంతో అదే క్లైమాక్స్‌ను తెరకెక్కించగా, సినిమా సూపర్ హిట్‌గా నిలిచిందని తెలుస్తోంది. ఇలా త్రివిక్రమ్ టచ్ పడటంతో ‘సంతోషం’ సినిమా రూపురేఖలే మారిపోయాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Next Story