నన్ను మాట్లాడనివ్వండి

by Ravi |   (  Updated:2026-04-30 14:23:57  IST  )

Poem

నన్ను మాట్లాడనివ్వండి
X

నిమిది గంటల పనిదినం ఎలాంటిదో ఎరగను నేను.

ఉదయం పదవుతూనే బట్టల కొట్టులో కొలువు తీరుతాను‌.

మీరు రాగానే చిరునవ్వుల తివాచీ పరుస్తాను.

ఆప్యాయపుటత్తరు చల్లుతాను.

మీరు ఏది ఎంచుకోవాలన్నా దిక్సూచినవుతాను.

దయం మధ్యాహ్నమౌతుంది…

సాయంకాలమౌతుంది... రాత్రవుతుంది...

మధ్యలో రెండుసార్లు షావుకారు ఉదారంగా పంచే తేనీరు

ఇంటినుంచి వస్తున్నప్పుడే తెచ్చుకున్న చల్లారిన మెతుకులు

అమృతంలా ఆస్వాదిస్తాను.

ఇంకా పదవని గడియారం ముళ్లు గుచ్చుకుంటాయి.

అప్పుడు వేంచేసే కొనుగోలు మహారాజుల,

రాణుల కోసం ప్లాస్టిక్ పూల నవ్వులు పూయిస్తాను.

వారు కుళ్ళు హాస్యోక్తులు వెలగబెట్టినా,

వరప్రసాదంలా మూట కట్టుకుంటాను.

ఇంటి ‘చింత’ల మంటల్ని ఒడికట్టుకునే,

అర్ధరాత్రికి రెండే గంటలు బాకీ ఉన్నంతవరకూ

బండి లాగిస్తాను.


నీస వేతనం ఒకటుందని ఎవరు చెప్తారు నాకు?

ఇచ్చే గొర్రెతోక జీతంతోనే ఏకరూప దుస్తులు సమకూర్చుకోవాలి.

కాళ్ళకి కవచాలు బిగించాలి.

నడుముకు పటకాలు ధరించాలి.

నివాస సముదాయాలు మొదలుకొని,

బహుళజాతి సంస్థల వరకూ,

పెద్ద పెద్ద దుకాణాల నుంచి,

బ్యాంకులూ, ఏటిఎంల వరకూ,

అంతటా కాపలా కుక్కలం మేమే!

డాబాబులు కనబడితే నిటారుగా నుంచోవాలి.

దొరగార్ల వాహనాల తలుపుల తాళాలం కావాలి.

పనిగంటలు పది వరకు సాగినా, మించినా,

‘మహాభాగ్యం’ అనుకోవాలి.

ఎంత ముట్టినట్టు సంతకం చేసినా,

చేతికొచ్చేది పదివేలు దాటితే గగనమే.

‘అందరికీ సామాజిక భద్రత దిశగా అడుగులు’ అంటూ,

వార్తాపత్రికలూ, దృశ్య, శ్రవణ సాధనాలూ ఘోషిస్తుంటే,

అప్రయత్నంగానే నా నోరు తెరుచుకుంటుంది.

మా సంస్థల లాంటి సంస్థలలో,

ఆ చట్టాలిప్పటికే అమలులో ఉన్నట్టు స్పష్టపరిస్తే,

తెరిచిన నోరు మూతపడటం మరచిపోతుంది.


జమానినేమైనా అడగడానికి భయం లేదు నాకు‌.

ఎందుకంటే, మా జోడే మా పెద్ద కూలీను.

మోకాళ్ళమీద కూలబడి,

మీ పాదాలకు రక్షలు తొడుగుతాను నేను.

నాకొచ్చే నెల బిచ్చం పదివేలైతే,

బిల్లు వ్రాసేవాడి చేతిలో పడే మాదాకబళం

మరో రెండువేలు.

తోలుబొమ్మలాడించే విధాత ఎవరో ఎరగం మేం.

దేశ దేశాలలో ఊడలు దింపిన మర్రిచెట్టు మా సంస్థ.

ఒక్కో పట్టణంలో ఎన్నో శాఖలుండటం మా ఘనత.

మాది నియామక పత్రం ఎండమావియైన ఉద్యోగం‌.

ఏ దస్త్రాలలోనైనా చిత్ర‘గుప్తులు’

మా పేర్లు వ్రాస్తారేమో తెలియని అజ్ఞానం.

కార్మిక లోకాన్ని ‘కాచే’ అధికార గాంధారుల కలికానికీ కానరాం మేం.

కార్మిక నాయక గణాలకూ ఆనం మేం.

క చాలు స్వకుచమర్దనాలు, స్వాలింగనాలు.

ఈ ‘మేడే’లు, విజయోత్సవాలూ ఆపండి.

అధిక శాతం కార్మిక లోకం దగాపడటం మానలేదని చాటండి.

కబేళాకు తోలుకుపోతున్న మేకల్లా, మేం ‘మే’ ‘మే’ అంటుంటే,

అవి, ‘మేడే’ ధ్వానాలని భ్రమించడం మానండి.

లో రంగు జెండా చేత పట్టుకుని,

ఒకరిపై మరొకరు బురదలు జల్లుకుంటూ,

ఎన్నాళ్ళు ‘లాంగ్‌మార్చ్’ చేసినా, ఉన్నచోటే ఉంటారు.

కత్రాటి మీదకు రండి/

పోయేవి పదవులు, ప్రాభవాలు మాత్రమేనని ఎరగండి.

ప్రస్తుతానికి ‘ఉట్టి’ ఎక్కుదాం పదండి.

ఉన్న కార్మిక చట్టాలనే సమర్థవంతంగా అమలు చెయ్యాలనే,

ఒకే ఒక్క ఎజెండాతో మరో ప్రస్థానం మొదలెట్టండి.

-మల్లాప్రగడ రామారావు

9989863398

Next Story