ఎండజల్లు..

by Ravi |   (  Updated:2026-04-20 00:00:59  IST  )

Poem

ఎండజల్లు..
X

ఎడతెరిపి లేకుండా కురుస్తోంది ఎండ

ఏ ఎండకా గొడుగేమోకానీ

ఏ గొడుగు పట్టినా

నిలువ నీడలేకుండా చేస్తోందీ ఎండ

ఎండ కురవని చోటంటూ లేదు

డాబాల్లో వుంటే మాడిన

పెనంలాగా మండించి మసి చేస్తోంది

గుడెసెల్లో వుంటే చిల్లులగుండా కురిసి

నిప్పుల వానలా మీద దాడి‌చేస్తోంది

చెట్టొక్కటే ఈ ఎండ జల్లును

నిలువరించే ఆయుధమని

వెతకుతూ‌ పోతే చెట్టు ఆచూకీ

ఎక్కడా దొరక్క ఎండ చినుకులతో

బొబ్బలెక్కిన దేహంతో

తిరిగి రావాల్సి‌ వస్తుంది

వానలా కురుస్తున్న ఈ ఎండ

ఎప్పుడాగుతుందో తెలియదుగానీ

మనిషి చేసిన ఘనకార్యాలకు

మండగొడుతోందీ ఎండ

ఈ ఎండ‌జల్లు‌ తగ్గేదెపుడో

మళ్లీ‌ మనుషులుగా మనం

తడి తడిగా విరబూసేదెపుడో

- చిత్తలూరి

9133832246

Next Story