శిథిలాలే మిగిలాయి..

by Ravi |   (  Updated:2026-04-13 01:00:30  IST  )

Poem

శిథిలాలే మిగిలాయి..
X

పొద్దు పొడుపు వేళ

పక్షుల కిలకిల రావాలతో కాదు

బాంబుల మోతతో నిద్రలేస్తున్న జనం..

ఏ క్షణం ఏ బాంబు పడుతుందో?

ఏ శబ్దం చివరిదవుతుందో?

ఏ అడుగు తుదిదవుతుందో? తెలియక

కంటిమీద కునుకు లేక ప్రాణాలు

అరచేతిలో పెట్టుకుని నిరంతర

భయాందోళనతో బతుకీడుస్తూన్నారు.

ఇల్లు, బడి... ప్రాంతమేదైనా

భయం ఒక్కటే... అదే యుద్ధం...

ఎవరికోసమీ రణరంగం?

ఈ యుద్ధం సాధించినదేమిటి?

ఎందరో స్త్రీలకు కడుపుకోత...

శిధిలాల్లో తమవారిని వెతుక్కోవడమే కదా!

నాటి కురుక్షేత్రం నుంచి

నేటి ప్రపంచ యుద్ధాల దాకా

మిగిలింది కన్నీళ్లు, విషాదం..

సాధించినది శూన్యమే కదా!

ఎందుకు చనిపోతుందో

తెలియని పసికందు

ఏ దేశానికి శత్రువు?

ఏ యుద్ధానికి కారణం?

యావత్ ప్రపంచాన్ని

వణికించే ఈ యుద్ధం

ఎవరిని ఉద్ధరించడానికి?

రణ భూమి గుర్తులైనా

రక్తపుటేళ్లు, శవాల గుట్టలు...

ఇవి గెలుపు గుర్తులా?

మానవత్వపు ఓటమి చిహ్నాలా?

కదన రంగంలో గెలుపైనా, ఓటమైనా...

సాధించేది, చివరకు మిగిల్చేది శిధిలాలే.

-డాక్టర్ ఆవుల రేణుక

93982 68976

Next Story