ఇవాళ కూడా..

by Ravi |   (  Updated:2026-04-13 00:45:58  IST  )

Poem

ఇవాళ కూడా..
X

ఇవాళ కూడా.. ఎప్పటి లాగే తెల్లవారింది

నిన్న.. కృష్ణానది వంతెన మీద నించి

దూకిన రైతు మరణించాడు

మొన్న పురుగుమందు తాగిన రైతు జీవితం

ఆసుపత్రికి వెళ్లే దారిలో ముగిసింది

ఒక నిరుద్యోగి మరొక నిరుద్యోగితో

మాట్లాడే విషయం మారలేదు..

ఇరుగింటి వారి కూతురు

బాల్య వివాహం సాఫీగా జరిగింది

ఈ వార్త పత్రికలకు చేరలేదు

అధికారులు, విద్యావంతులు

బంధు మిత్రులు విందులో

పాల్గొని దీవించారు

అమాయకంగా.. ఇంత పిల్లకు

పెండ్లి ఎందుకు అనే ప్రశ్నకు,

ఊరి మగ పిల్లలకు ఓగెం లేదు

అనే మాట మామూలుగానే వినిపించింది

ప్రకృతి మీద కవి గారి పద్యం

వహ్వా అనిపించుకుంది

రాజు గారికి చడీ చప్పుడు లేని

ప్రశాంత వాతావరణం కావాలి

నిద్రాభంగం సహించరు వారు

ఏమైనా మనకెందుకు అనే లోకం కావాలి

కానీ.. భూమి ఆకలికి దప్పికకి ఆగదు

స్వాభిమానం లేని దీన కాదు

అవును.. ఇవాళ కూడా నిన్నటి లాగా

అన్నీ జరుగుతున్నాయి..

నిద్రాభంగం తప్పదు..

- ఎం. రాఘవాచారి,

94907 03857

Next Story