స్వరమై నిలిచే పద్యం..

by Ravi |   (  Updated:2026-04-13 00:45:28  IST  )

Poem

స్వరమై నిలిచే పద్యం..
X

ప్రజాకవి కావాలంటే

పాత కథల ప్రతిధ్వని కాదు,

గాయాల లోతుల్లో పుట్టిన

నిశ్శబ్ద కేక వినిపించాలి

గుండె పగిలిన చోట రక్తం కాదు..

వేదన వాసనతో అక్షరాలు జారాలి

గాలి మాటలు రాస్తే అవి దూరం పోతాయి..

పుస్తకాల పుటల్లో పడుకున్నా

జ్ఞాపకాలలో మేల్కొనవు

నిజం కళ్లలోకి నేరుగా చూసినపుడు..

ఒక ఆలోచన మనసులో నిద్రపోదు

అగ్నికణంలా మెరుస్తుంది

బయటి ప్రపంచం మాత్రమే కాదు...

నీ అంతరంగపు చీకట్లలోకి దిగు

నువ్వు నమ్మిన నీడల్నీ ఒక్కసారి ప్రశ్నించు

సందేహం.. చీకటిలో తొలిచిన చిన్న దీపశిఖ

సత్యం.. నీ అడుగులకు వెలుగు వేసే దారి

ఒక రోజు.. నీ మాట గళమై మారుమోగుతుంది

నీ అడుగు మార్గమై నిలుస్తుంది

నీ కలం.. గాయంలా మిగిలే గుర్తు అవుతుంది

ప్రతిధ్వనిలా కరిగిపోకు, స్వరమై నిలిచిపో!

-జ్యోతి మువ్వల

90080 83344

Next Story