నేను మరణిస్తే.....బూడిదనై

by Ravi |

Poem

నేను మరణిస్తే.....బూడిదనై
X

నేను మరణిస్తే

కరెంటు పొయ్యిల మీద కాల్చకండి మిత్రమా!

ఆ బూడిద కూడా పనికిరాదు.

కరెంటు పొయ్యిలో కాల్చినప్పుడు

నా శరీరంతో పాటు నా నమ్మకాలు కలలు ఆశలు

ఆశయాలు కరిగిపోతాయి మిత్రమా!

మిత్రమా!

నా కళేబరాన్ని కట్టెల మంటలకి అప్పగించండి. అప్పుడు,

నా శ్వాసకు చివరి ఉష్ణత ఉంటుంది.

కట్టెలలో కాల్చినప్పుడు

బూడిదనై ఫాస్పరసునై భూమికి బలాన్నౌతా.

పండే పంటకు ఎరువౌతా.

బూడిదనై నేలలో కలిసినప్పుడు

అది పంట అవుతుంది.

ఫైరు అవుతుంది.

విత్తనాల గుండెల్లో ఆకలికి అర్థమవుతుంది.

మిత్రమా!

బూడిదనై ఆకాశంలో తేలితే

నీలి నీలి మబ్బుల్లోనీ వాన మాట చెబుతాను.

ఎండిన నేల తల్లి కళ్ళకు

వర్షపు చుక్కల భాషనౌతాను.

భూమికి ఆకాశానికి ఆత్మీయ సంబంధాన్నౌతాను.

మిత్రమా!

బూడిదనై కొండ కోనలలో కూర్చుంటే

రాళ్లకు జ్ఞాపకాల జల్లుల గురుతునౌతాను.

చెట్టుకు హరితనౌతాను.

లోయల్లో రంగురంగుల పూల వనాలనౌతాను.

నిశ్శబ్దానికి స్వరం వస్తుంది.

మిత్రమా!

బూడిదనై పల్లెల్లో పడితే

మట్టిలో మనిషి వాసన మొలకలెత్తుతుంది.

పట్టణాలలో చల్లితే ఇనప రాతి గుండెల్లో

మనిషి మనసు మొలుస్తుంది.

అక్కడ, కష్టజీవుల గాధలు వింటా.

పట్టణాలలో పల్లెల్లో

కణకణ మండే కడుపుల్లో

ఎర్రజెండానై లేస్తా.

ఆకలి కారణం శరీరం కాదు.

వ్యవస్థ అని అర్థమవుతుంది.

మిత్రమా!

అంతిమంగా

నా బూడిద ఎర్రజెండై ఎగిరితే

అది కోపం కాదు-న్యాయం కోరే నిశ్శబ్ద అగ్ని.

నా మరణం చివరి శరణం కాకూడదు మిత్రమా!

అది పంటగా ఫైరుగా వానగా జెండాగా

మళ్లీమళ్లీ జీవించాలి.

మళ్లీ మళ్లీ జీవించాలి.

మిత్రమా!

కట్టెల్లో కాల్చడం కాదంటారా!?

అయితే,

నా కళేబరాన్ని మెడికల్ కాలేజీలకు ఇవ్వండి.

మంటలకన్నా "జ్ఞానపు వెలుగు మేలు" కదా!

నేను, మెడికల్ విద్యార్థుల చేతుల్లో

నెమ్మదిగా తెరుచుకునే పుస్తకాన్నౌతాను.

జీవితం ముగిసిన చోట

జ్ఞానం మొదలయ్యే చోట

ఒక పాఠం అవుతాను.

కొత్త పరిశోధనలలో ఒక ప్రశ్న నవుతాను.

నూతన ఆవిష్కరణలకు

నిశ్శబ్దమైన మూలమవుతాను.

రోగాలకు మరణాలకు కారణాలేమిటో?

తెలుసుకునే ముడిసారంగా మారతాను.

నా చావుకు ఓ అర్థం ఉండాలి.

నా చావు వృధా కాదని చెప్పే ఓ సాక్ష్యముండాలి.

కానీ--

మిత్రమా!

శవం అని, చచ్చింది అని

చీకటి గదిలో మురికి నేలపై

బట్టలు లేకుండా పడేయకండి.

ఊపిరి లేకపోయినా

ఊపిరి తీసుకోకపోయినా

శవాలకు గౌరవం ఉండాలి కదా?

శరీరం చచ్చినా

మనుష్యత చావకూడదు మిత్రమా!

నేను మౌనమయ్యాను.

మానవత్వం మాత్రం మౌనమవ్వకూడదు మిత్రమా!

మానవత్వం మాత్రం మౌనమవ్వకూడదు మిత్రమా!

-కాంతి నల్లూరి

63003 28040

Next Story