నేను మరణిస్తే..

by Ravi |

Poem

నేను మరణిస్తే..
X

నేను మరణిస్తే.... మరణం సహజం.

ఎప్పుడో ఒకప్పుడు అందరూ మరణిస్తారు.

మనుషులే కాదు చెట్టు పుట్ట,మొక్క

క్రిములు కీటకాలు జంతువులు

ప్రాణమున్న ప్రతి ఒక్కటి మరణిస్తుంది.

వాటి మరణానికి ఓ అర్థం ఉంటుంది.

"బ్రతికనన్ని నాళ్ళు ఫలము లిచ్చుటే గాదు

చచ్చి కూడా చీల్చి యిచ్చుతనువు"

ఈ పద్యం నా విద్యార్థులకు

చెబుతున్నప్పుడు, నిత్యమై మెలిగేది.

నేను మరణిస్తే పూడ్చి వేయడాన్నే కోరుకుంటాను.

మట్టిలో మట్టినై ఈ భూమికి బలాన్నై

ఆ మొక్కకు ఈ చెట్టుకు ఎరువు నవుతాను.

భూమి మట్టిపొరల కింద పోతులూరి వీరబ్రహ్మoలా

జీవ సమాధిలో నుండి నే బతికే ఉంటాను.

నా సమాధి పైనుండి వర్షపు చుక్కలు

జాలువారుతున్నప్పుడు సంతోషాన్ని అనుభవిస్తాను.

జలపాతాలై పారుతున్నప్పుడు నేను ఈత నేర్చుకుంటాను.

మంచు కురిచేవేళ తుషారపు ఆనందం పొందుతాను.

శీతాకాలపు గడ్డకట్టే చలికి మట్టి దుప్పటిని కప్పుకుంటాను.

భగభగ మండే వేడికి మట్టి పొరలలో దాక్కుని,

మట్టి కింద ఏసీ చల్లదనాన్ని ఫీల్ అవుతాను.

మిత్రమా

నాపై వరిచేలు మొలకెత్తుతున్నప్పుడు

మొలకల సౌందర్యాన్ని ఆస్వాదిస్తాను.

ఈ దేశ ప్రజల కంచాలలో ముద్దవుతాను.

అవుతున్నందుకు మైమరిచిపోతాను.

పత్తిచేలల్లో విచ్చుకుంటున్న పత్తికాయల శబ్దాన్ని

ఉషోదయపు సంగీతంలా వింటాను.

కంది,జనప,వలసే పూల

పచ్చటి మెత్తటి సౌందర్యాన్ని తాగుతాను.

మిత్రమా

మిరప మొక్కల సౌందర్యం మీకు తెలుసా!?

పచ్చటి ఆకులు తెల్లటి పూలు

లేతాకు పచ్చరంగు కాయలు

లేలేత ఎరుపు కాయలు ముదురు ఎరుపుగా

మారుతున్నప్పుడు ఎర్రజెండానై ఎగురుతుంటాను.

చిత్రాతి చిత్రం వేరుశనగ.

ఇలాంటి విచిత్రాలను

భూమి అడుగునుండి పూజిస్తాను.

నాకు నచ్చని పొగాకు చేదును గరళ కంఠుడిలా

గొంతులో దాసుకుంటాను.

నాపై గులాబీలు గుల్ మొహరాలు పూస్తాయి.

నైట్ క్వీన్,కొండమల్లెల పరిమళాలు వెద్దజల్లుతాయి.

కలువ తామరలు యిచ్చుకుంటాయి.

కొండగోగులు మరింతగా ఎరుపెక్కుతాయి.

నాపై పంట కాలువలు ప్రవహిస్తాయి.

ఆ కాలవల్లో వన్నెవన్నెల చేపలు ఈదులాడుతాయి.

రంగు రంగుల పక్షులు నాపై వాలి

కూతల సరిగమలు వినిపిస్తాయి.

పావురాళ్లు,కీసురాళ్లు డప్పు డోలక్ దరువులేస్తాయి.

కోయిల కుహు కుహు పాట పాడుతుంది.

నెమలి నాట్యమాడుతుంది.

పక్షుల కచేరీలో లేళ్ళు జింకలు ప్రేక్షకులవుతాయి.

మాయదారి నక్కలు జిత్తులుమారి తోడేళ్లు

కాపు కాస్తుంటాయి.

పులులు సింహాలు వేటాడుతుంటాయి.

పాలస్తీనా,ఇరాక్, వెనిజువేలాలు బలవుతుంటాయి.

ఆదాని, అంబానీ, మిట్టల్, జిందాల్‌లు

ఈ దేశాన్ని దోసుకుపోతుంటారు.

వ్యవసాయ భూములను, గనులను, ఫ్యాక్టరీలను

ఈదేశ పాలకులు మోడీలు మోషాలు,

బాబులు, గాలులు కార్పొరేట్లకు కట్టబెడుతుంటారు.

రైతులు కూలీలుగా,

కార్మికులు బిచ్చగాళ్ళుగా

మారటాన్ని చూస్తూ

భూమి లోపల ఊపిరి ఆడక

నిజంగానే అప్పుడు చచ్చిపోతాను.

భూమి లోపల మట్టి పొరల కింద

మౌనంగా ఏకాంతంగా గమనిస్తూనే ఉంటాను

ఈ దేశపు యువత సేవ చచ్చి బతుకులీడ్చడాన్ని.

-కాంతి నల్లూరి

63003 28040

Next Story