అక్షరీకరణం..

by Ravi |   (  Updated:2026-02-16 00:16:07  IST  )

Poem

అక్షరీకరణం..
X

చూచిన దృశ్యాలు

కళ్ల అంచుల్లో ఆగక

మనసు గోడలపై చిత్రాలై నిలిచిపోతే,

వాటిని అక్షరాలుగా కట్టిపడేస్తాను.

తట్టిన ఆలోచనలు

మెరుపుల్లా మెదిలి

మాయమయ్యేలోపు

పదాల వలలో పట్టి కవితగా మలుస్తాను.

ఏర్పడిన భావాలు

హృదయపు లోతుల్లో

నిశ్శబ్దంగా ఉప్పొంగి ఊపిరి కోరినప్పుడు

వాగ్దేవి వాక్యాలుగా వెలువరిస్తాను.

ప్రకృతి అందాలు

పూల పరిమళాలు, ఆకుల గుసగుసలు,

నదుల పారుదల,

వాన చినుకుల చిరునవ్వులను

అక్షరాల పూలమాలగా

అర్థవంతంగా అలంకరిస్తాను.

మెరిసిన మెరుపులు

ఆలోచనలకు వెలుగై, అక్షరాల్లో చమకించి,

మేఘాల గర్జనలు వేదనల ఉగ్రస్వరమైతే

పుటలపైకి ఎక్కించి

పలుకవనాలకి ప్రాణం పోస్తాను.

ఇదే నా సాధన

జీవితం తాకిన ప్రతి క్షణాన్ని

అక్షరాలుగా మారుస్తూ,

అనుభవాన్ని కవితలుగా చేసి

కాలానికి అర్పించటమే

అక్షరీకరణం అని చాటుతాను.

- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్

91779 15285

Next Story