- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నిరీహ, నిస్పృహ, నిట్టూర్పుల
గురించి యోచనే రాదు
వ్యతిరేక ఆలోచనలకు
సమయమే ఉండదు
ఊపిరి సలపనంత పనిలో
ఒత్తిడి కూడా ఉత్సాహాన్నిస్తుంది
నా పని నాకు అప్పులు మిగల్చదు
ఖర్చులన్నీ పోగా మిగులే మిగులుస్తుంది
నేను చేయి చాచకుండా
చేయి చాచినవారికి లేదనకుండా
నా పని తోడుంటుంది
నా పనే నా ఆత్మగౌరవ పతాక
ఆత్మవిశ్వాస ప్రతీక
నేను పిల్లలకు పాఠాలతో, పాఠాలలో
విలువల కథలు విలువైన కథలు చెప్పి
వారి మనోక్షేత్రంలో విశాల భావనలనే
విత్తనాలు నాటుతాను
పనిని గౌరవించమని బోధిస్తాను
గౌరవంగా బతకమని ప్రభోదిస్తాను
వేకువ పిట్టల సుప్రభాత గీతాలు వింటూ
అసహాయంగా అనాయాసంగా
ఇంటి పనంతా చేసుకునే నన్ను
అప్పుడప్పుడు పరామర్శించటానికైనా
అనారోగ్యాలు రాలేవు
పక్షుల పాటలు, పిల్ల తెమ్మెరలు,
పచ్చని చెట్లు, నచ్చిన కవిత్వ పఠనం
నా ప్రియ నేస్తాలు
ఇది లోకానికి నా వ్యక్తం
నా లోలోపల చెలరేగే తుఫానులు
నన్ను ఉక్కిరిబిక్కిరి చేసే సుడిగుండాలు
నన్ను వదలక వెంటాడే వేదనా వీచికలు
నన్ను నిరంతరం భయపెట్టే
రేపటి సముద్రాలు
ఇది లోకానికి అవ్యక్తం
అవ్యక్తం వ్యక్తం కానపుడే బాగుంటుంది.
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678
- Tags
- Poem






