ఏ కర్రకు నిప్పుంటే..

by Ravi |   (  Updated:2025-11-10 00:45:07  IST  )

Poem

ఏ కర్రకు నిప్పుంటే..
X

పహల్ గామ్‌లో మారణకాండ

పహలాదేమీ కాదు

పాలు పంచుకున్న రోజునుండీ

పలుమార్లు పాశవికంగా జరిగిన

మారణహోమానికి ఇది కొనసాగింపు

నిరాయుధులపై దాడి

నీ నిర్లజ్జకు నిదర్శనం

దొంగచాటు దెబ్బ

నీ మురికి చరిత్రకు మరో మరక

చెదిరిన సిందూరం

బెబ్బులై గర్జించింది

సహనానికి కొమ్ము మొలిచి

శత్రువును నిర్జించింది

పగిలిన గాజుల రగిలిన

పగ రక్తం తడియారకముందే

ప్రతీకారం తీర్చుకుంది

రావణకాష్టంలా రగులుతున్న

ఈ అగ్నిని ఏ రాజు రాజేసెనన్న

వాదన అప్రధానం

తప్పుల మీద తప్పులు చేస్తున్న

తంపులమారిని తగిన విధంగా

దండించడమే తక్షణ కర్త్యవ్యం

ధర్మం సుఖ జీవనానికి మార్గం

శాంతి కోరి చేయి చాచిన ప్రతిసారీ

నీ పంచన పొంచిన వంచన

మమ్ము కాటేస్తూనే ఉంది

త్రికరణ శుద్ధిలేని చెట్టుకు

నిజాయితీ పూలు పూయవు

సత్యం ఒక నాటకమైన తోటలో

సౌహార్ద ఫలాలు కాయవు

తటపటాయింపు కపట సంధి ప్రస్తావనలొద్దు

తప్తకాంచనమై మనసు తెరిచి చూడు

మా స్నేహ దీప కాంతితో వెలిగే

నీ లోగిలిలో వెలుగులు చూడు

అసూయా ద్వేషాలు ఆరని అనల జ్వాలలు

అనవరతం నిన్ను దహిస్తూనే ఉంటాయి

ఏ కర్రకు నిప్పుంటే .. మరి

ఆ కర్రేగా కాలేది

-డా. దాసరి వెంకట రమణ

90005 72573

Next Story