- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఈ నగరం నెత్తి మీద
ఆగకుండా ప్రవహించే కాంక్రీటు నది ఇది.
ఇనుప చువ్వలే దీనికి ఎముకలు
సిమెంటే దీనికి చర్మం.
రాక్షస కాళ్ళ మీద నిలబడి
ఊరి గుండె మీద నుండి సాగిపోతుంది.
దీని మీద పరుగెత్తేవి చేపలు కావు
రంగురంగుల డబ్బాలు, యంత్రాలు.
లోపల ఉన్న మనుషుల ముఖాలు కనిపించవు
వాళ్ళ కలలు, కన్నీళ్లు అస్సలే కనిపించవు.
వాళ్ళందరిదీ ఒకటే గమ్యం - వేగం.
ఒకరినొకరు దాటుకుంటూ పోవడమే జీవితం.
నేను దీని కింద నిలబడిన
ఒక పాత రాతి విగ్రహాన్ని.
పైనుండి నా మీద
పడుతున్నది వెలుగు కాదు
వేల వాహనాల నీడల భారం.
జలపాతంలా ఘోషిస్తున్న
ఈ హోరు శబ్దంలో
నా గొంతులోంచి వచ్చే మాటలు
నాకే వినిపించడం లేదు.
ఈ బరువుకి నా వెన్నెముక
నెమ్మదిగా కిందికి కుంగుతోంది.
కొన్నిసార్లు అనిపిస్తుంది
నేనూ ఈ పిల్లర్‌లలో ఒకదాన్ని
అయిపోతే బాగుండని.
భావాలు లేని, కదలిక లేని
ఒక కాంక్రీటు మౌనాన్ని ధరించి.
ఈ కాంక్రీటు నది
ఇప్పుడు నా నరాల్లో
కూడా ప్రవహిస్తోంది.
-భూక్యా గోపినాయక్,
99891 59196
- Tags
- Poem






