రిజర్వేషన్లు అందని ద్రాక్షలు

by Ravi |   (  Updated:2025-08-18 00:00:34  IST  )

Poem

రిజర్వేషన్లు అందని ద్రాక్షలు
X

వెనుకబడిన తరగతులకు

రిజర్వేషన్లు ఎప్పటికీ వెనకెనుకే

ఇచ్చే వాడికి ఇవ్వాలనీ లేదు

పుచ్చుకునే వాడికి ఐక్యతా లేదు..

ప్రతిపక్షం, స్వపక్షం మిత్ర పక్షం

అన్ని అగ్ర కుల పక్షమే..

అన్నీ పార్టీల..దోబూచులాటలే..

ఓటు బ్యాంకు రాజకీయాలే

అంతు చిక్కని దాగుడు మూతలే..

చివరికి బకరాలు బడుగులే..

ధర్నాలు, రాస్తా రోకోలు

ఊకదంపుడు ఉపన్యాసాలు

కంటి తుడుపు మంత్రాలే..

ఏ పార్టీ అంతరంగంలో ఏముందో

ఆ తంత్రాల గుట్టు పెరుమాండ్లకే ఎరుక..

బడుగులు గొడుగులు పట్టడానికే

జెండాలు మోయడానికే..

అగ్రకుల వినాయకుల

మోచేతి నీరు త్రాగడానికే..

ఐక్యతగా ఉన్న గిరిజనులు

దర్జాగా ఉన్నారు..

తెలివిగా ఉన్న దళితులు

ఠీవిగా ఉన్నారు..

వారి కోట వారికి ఉంది..

ఎటొచ్చీ యాభై శాతం ఉన్న ఎడ్డివాళ్లు..

ఎగాదిగా మోసపోతున్నరు..

లేకుంటే పట్టున

పది శాతం లేని అగ్రకులాలు

మిగతా తొంభై శాతాన్ని

ఎలా తొక్కి పెట్టగలరు చెప్మా..

గొర్రె కసాయి వాడ్ని నమ్ముతుంది

పార్టీల కొంగ జపం నమ్మే

బీసీ ఎప్పటికీ బికారే..

తన భవితకు తనే తలారి..

మోసమెరుగని బడుగు జనం

తన వాటా తన్నుకు పోతున్నా

చలనం లేని పరాన్న జీవులు

చరిత్రలో మిగిలి పోయే అసమర్థులు..

భావి బడుగుల భవితకు

గుది బండలు..

ఓ బీసీ..ఇకనైనా మేలుకో

నీ వాటా నీవు ఏలుకో..

శిరందాస్ శ్రీనివాస్

94416 73339

Next Story