మాయీ!!

by Ravi |   (  Updated:2025-08-18 00:30:40  IST  )

Poem

మాయీ!!
X

మాయీ!! ఈ దేశంలో

సుభద్రమ్మ మైల బట్టల్లో

పుట్టే పసి జగన్నాధులు

కుక్క నీడకి వణికే భోగ

మండపాలలోని వైదిక్కర్మలు

మరిగి విధవలని అవమానిస్తారు

ఘర్ వాపసీ అని మొసలి కన్నీళ్లతో

హడలగొట్టే మొహం నిండా

కుంకుమ చల్లుకున్న నయా కాష్మోరాలు

మనసులో మలం నెత్తిపోసిన

కలబుర్గీలని కాటేస్తారు

ఇందులేడు అందుగలడంటు

స్తంభాలలో సమాధుల్లో దాగున్న

శూన్యాన్ని మంగళసూత్రాలకెత్తి

ఆడనెత్తిన ఆఖరి మొలలు కొడతారు

అమ్మల ఉమ్మనీరు తాగి పుట్టిన

ముఖేశులు, ములాయాలు

మర్మాంగాల రహస్యాలు తెలుస్కోనే

స్కాలర్లై ‘నాచ్ మేరీ బసంతీ’

అని గాజుముక్కలతో రాజ్యాంగాలపై

రక్త శాసనాలు రాస్తారు

దేవదాసీల నుదుళ్ల మీద

రాసిన నట్టువా మేళాలు

జోగిన్ల గుండెలమీదకెత్తిన

బోనాల సంబురాలు

సంపన్న సంస్కృతీ నేరబలుల

కుంకుమార్చనల్తో సరిచేస్తారు

నువ్వు అమ్మకాల సరుకుగా

పనికిరానంత కాలం

అమ్మ గొప్పతనాల అంగడిలో

నీ జయధ్వనాలే

పరువు ప్రతిష్టల

ఖాప్ పెద్దల శక్తీ మాతవే

ఇంత గొప్ప బిడ్డలని కని

మగబీజాలని తెలిసీ పురిటి

పుక్కిళ్లలో గోధుమగింజలతో

ముగించకుండా

ఇంకా ఓపిక పడుతూ ...

తుస్సీ గ్రేట్ హో !!!

మాతృక 2015 సౌజన్యంతో

- నిశీధి (గౌతమి మసూల)

Next Story