నీ మృతి.. ఓ విరామం కాదు!

by Ravi |   (  Updated:2025-06-30 01:15:22  IST  )

Poem

నీ మృతి.. ఓ విరామం కాదు!
X

నీవు వెళ్లిపోయావని తెలుసుకున్న వాక్యం,

నాలోని ఊపిరిని ఓ అప్రతిధ్వనిగా చీల్చింది.

స్వేచ్ఛ – నీ నామమే ఒక ఆశ్వాసంలా వినిపించేది,

కానీ నీవే... బంధాల కంచె గోడల మధ్య

చిమ్మిన వెలుతురు గానీ...

తీర్చలేని చీకటిలో నశించి పోయావా?

ఆ మేకప్ వెనక...

చెక్కబడని చిరునవ్వు వెనక...

బుల్లితెర పైన పలికిన

పర్యాయపదాల వెనక...

ఎంతదాకా బాధ

దాచుకున్నావు స్వేచ్ఛ?

ఏ బలవంతం నీ గుండెను బద్దలుకొట్టింది?

ఏ మాట నిన్ను శిలగా మార్చింది?

కోరికల్ని త్రోయలేని తలపులు

చూపుల్లో పగలబడి,

రాత్రుల్లో మౌనంగా ఏడ్చాయా?

నువ్వు తట్టుకున్న భయాల చిల్లు

నీ వెనుక ఎవరికీ కనిపించలేదా?

నువ్వు వంచుకున్న తల...

నీ బాహ్యం లోకం చూసింది

కానీ నీ అంతర్లీనం ఎవరూ వినలేదు.

స్వేచ్ఛ... నీ ఆఖరి ఉసురు నన్ను ప్రశ్నించింది –

“ఎంతకాలం బాధను మౌనంగా పూజిస్తాం?”

“ఓ మహిళ ఏడిస్తే మనకు బాధగా అనిపించదు –

కానీ మౌనమవుతున్న దాన్ని గమనించలేమా?”

నీ మృతి.. ఓ విరామం కాదు...

ఓ సంచలనం కావాలి.

ఒక స్వేచ్ఛ... మరొకరికి ఆత్మవిశ్వాసంగా

మిగిలితే బావుండేది..

(జర్నలిస్టు స్వేచ్ఛకు నివాళి)

శైలజామిత్ర

92909 00879

Next Story