కాలం పడగ విప్పి...

by Ravi |   (  Updated:2025-06-30 01:00:19  IST  )

Poem

కాలం పడగ విప్పి...
X

జర్నలిస్టు రాతలు రాస్తాడు.

కానీ, తన తలరాతను రాసుకోడు.

అక్షరం అక్షరం పేర్చి..

కాలమ్స్ కొద్దీ కథలు రాస్తుంటాడు.

కాలం తన ముందు పడగవిప్పి

నాట్యమాడేది గ్రహించడు.

ఒక ఆర్డరుగా హెడింగ్ పెడతాడు..

లీడ్ రాస్తాడు.. సూపర్ లీడ్ ఇస్తాడు.

కానీ అంతే ఒద్దికగా.. ఓర్పుగా

తన జీవితపు లీడ్‌ను ప్రిపేర్ చేసుకోడు.

తన కన్నీటి కథను

మనసులో దాచుకొని..

ఎన్నో మానవీయ

కథనాలను కండ్లకద్దుతాడు.

తన నేపథ్యమెంత

హృదయవిదారకంగా ఉన్నా..

సంఘటనలో చేరి,

సన్నివేశంలో లీనమై

హృద్యమైన కథనాలను అల్లుతాడు..

శిలను చెక్కినట్లు చెక్కుతాడు.

అక్షరాలతోనే కాదు, తన పరిచయాలతోనూ..

అడిగినవారికి సాయం చేస్తాడు.

అన్నా అని వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంటిప్పిస్తాడు..

కానీ తన ఆరోగ్యం గురించి పట్టించుకోడు.

కాలేజీల్లో సీట్లిప్పిస్తాడు..

కానీ బిడ్డకు స్కూల్లో ఫీజు రాయితీ

ఇప్పించుకునే సాహసం చేయలేడు.

తన నౌకరీ గ్యారెంటీ లేనిదే అయినా..

ఏ సోర్సూలేని వాళ్లెందరికో

ఔట్ సోర్సింగ్ నౌకరిప్పిస్తాడు.

బయటకు గంభీరమే అయినా..

లోపలేదో కనపడని ఒత్తిడుంటుంది.

ఎవరితో చెప్పుకోరాని బాధేదో ఉంటుంది.

ఎవరూ వెలికితీయని

భయమేదో దాగి ఉంటుంది.

అందుకే..

జర్నలిస్టు ఆత్మహత్య చేసుకుంటాడు.

హత్య చేయబడతాడు.

అకాల మరణం చెందుతాడు.

పదిలో ఒకరిద్దరు లౌక్యమెరిగి

సౌఖ్యంగా ఉంటున్నారు కానీ..

చాలామంది చస్తూ బతుకుతున్నవాళ్లే.!

- దాయి శ్రీశైలం

80966 77035

Next Story